
CM Jagan review over polavaram works
జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టులోని ఈసీఆర్ఎఫ్ డ్యాంలో కోతకు గురైన ప్రాంతంలో చేపట్టే పనుల ప్రణాళికపై సీఎం జగన్ అధికారులతో చర్చించారు. ఇప్పటికీ గోదావరిలో వరద కొనసాగుతోందని.. ప్రస్తుతం రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని సీఎంతో అధికారులు తెలిపారు. ఈసీఆర్ఎఫ్ డ్యాంలో ఎలాంటి పనులు చేపట్టాలన్నా ముందు కోతకు గురైన ప్రాంతంలో పరీక్షలు చేపట్టాలన్నారు. ఆ పరీక్షల్లో వెల్లడైన అంశాలు, దాని తర్వాత డిజైన్ల ఖరారు పూర్తయితే తప్ప పనులు చేపట్టలేమని వెల్లడించారు.
కోతకు గురైన ప్రాంతంలో పరిస్థితులు, డయాఫ్రం వాల్ పటిష్టతను నిర్ధారించే పరీక్షలు నవంబర్ నెల మధ్య నుంచి మొదలవుతాయని అధికారులు తెలిపారు. డిసెంబరు నెలాఖరు వరకు దీనిపై తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఆతర్వాత సీడబ్ల్యూసీ డిజైన్లు, మెథడాలజీ ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ పరీక్షలు జరుగుతుండగానే.. దిగువ కాఫర్ డ్యాం పనులు పూర్తిచేస్తామన్నారు. దిగువ కాఫర్ డ్యాం పూర్తికాగానే ఆ ప్రాంతంలో డీ వాటరింగ్ పూర్తి చేసి, డిజైన్ల మేరకు ఈసీఆర్ఎఫ్ పనులు ప్రారంభిస్తామన్నారు. ఈలోగా ఆర్అండ్ఆర్ పనుల్లో ప్రాధాన్యత క్రమంలో నిర్దేశించుకున్న విధంగా 41.15 మీటర్ల వరకు సహాయ పునరావాస పనులు పూర్తి చేయడంపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.
విజయనగరం జిల్లాలోని తారక రామ తీర్థసాగర్ పనులు నవంబర్లో ప్రారంభించనున్నట్లు అధికారులు సీఎం జగన్తో తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు మహేంద్ర తనయ పనుల పునరుద్ధరణకు అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. రూ.852 కోట్ల సవరించిన అంచనా వ్యయంతో.. త్వరలోనే టెండర్ ప్రక్రియను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు జూన్ కల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ దిగువన బ్యారేజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్ సూచించారు. అలాగే, రిజర్వాయర్లు, నీటి ప్రాజెక్టుల నిర్వహణపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని సూచించారు. అవసరమైన సిబ్బంది నియామకంతో పాటు, ప్రాజెక్టుల నిర్వహణపై ఒక కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్లాలన్నారు. ఎత్తిపోతల పథకాల పరిధిలో రైతులను కమిటీలుగా ఏర్పాటు చేసి.. వారి పర్యవేక్షణలోనే అవి నడిచేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు.