
cm ys jagan reviews over education department and issues key orders regarding schemes implementation
నాడు-నేడు, అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా వసతి, విద్యా కానుక.. ఈ పథకాల లిస్టు చాలు విద్యకు జగన్ సర్కార్ ఎంత ప్రాధాన్యతనిస్తుందో చెప్పడానికి. పేదింటి పిల్లలకు కార్పోరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా ఈ పథకాలను అమలుచేస్తోంది. ఏదో తూతూ మంత్రంగా పథకాలను అమలుచేయడం కాదు.. అత్యంత నాణ్యమైన, మెరుగైన పద్దతిలో ఈ పథకాల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం సీఎం జగన్ విద్యా సంబంధిత కార్యక్రమాలు, పథకాలపై ఎప్పటికప్పుడు రివ్యూ జరుపుతున్నారు. తాజాగా తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో విద్యా శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా విద్యా కానుక పథకం ప్రణాళికలు, నిర్ణయాల అమలును అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. 2023-24 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులందరికీ విద్యా కానుక అందేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. దీనికి సంబంధించిన పనులన్నీ వేగవంతంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. స్కూళ్ల నిర్వహణపై ఎప్పటికప్పుడు సచివాలయ ఉద్యోగుల నుంచి రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నామని తెలిపారు. ఆ రిపోర్ట్స్ ఆధారంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఏ అవసరం ఉన్నా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు.
టీచర్లకు, 8వ విద్యార్థులకు కలిపి ప్రభుత్వం 5,18,740 ట్యాబ్స్‌ను పంపిణీ చేయనుంది. ఇందులో ఇప్పటివరకూ లక్షన్నర ట్యాబ్స్ వచ్చాయని… మిగతా ట్యాబ్స్ త్వరలోనే వస్తాయని అధికారులు సీఎంకు తెలిపారు. ట్యాబ్స్ వచ్చాక వెంటనే అందులో కంటెంట్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనికి బదులిచ్చిన అధికారులు.. ముందుగా టీచర్లకు ట్యాబ్స్ పంపిణీ చేసి.. మొదట వారికి కంటెంట్‌పై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ ట్యాబ్స్ ద్వారా 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బైజుస్ ఇ-కంటెంట్ అందిస్తామని చెప్పారు. బయట మార్కెట్లో వేల రూపాయల ఖర్చయ్యే కంటెంట్‌ను ఉచితంగా విద్యార్థులకు అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇంత చేస్తున్నా… ప్రత్యర్థులు దాన్ని వక్రీకరించి విష ప్రచారం చేస్తున్నారని అధికారులు సీఎంతో చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం.. విద్యా సంబంధిత కార్యక్రమాలు, నిర్ణయాలను కూడా రాజకీయం చేయడం, స్కూల్ పిల్లలను కూడా అందులోకి లాగడం దురదృష్టకరమని అన్నారు.