
Jagan avanigadda visit
నాయకులమని చెప్పుకుంటున్న కొందరు వీధి రౌడీలను మించిన బూతులతో రెచ్చిపోతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంటే.. మరోవైపు దత్తపుత్రుడితో దత్త తండ్రి ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నాడని అన్నారు. చెప్పుకోవడానికేమీ లేనివారు.. గతంలో ప్రజలకు ఎలాంటి మేలు చేయనివారు.. వెన్నుపోటుదారులంతా కలిసి కూటమి కడుతున్నారని విమర్శించారు. అంతా కలిసి దుష్టచతుష్ఠయంలా ఏర్పడ్డారని.. ఒక్క జగన్ను కొట్టడానికి ఇంతమంది ఏకమవుతున్నారంటే ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అవనిగడ్డలో రైతులకు భూ యాజమాన్య హక్కుల పత్రాలను పంపిణీ చేసిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు.
రాష్ట్రంలో నేరుగా 87 శాతం ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్న ప్రభుత్వం తమదని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రజలకు ఏ మంచి చేయని పచ్చ రంగు పెత్తందారులకు, తమకు మధ్య ఇక నిరంతర యుద్ధమేనన్నారు. ఇది సామాజిక న్యాయానికి, సమాజాన్ని ముక్కలు చెక్కలు చేయాలనుకుంటున్నవారికి, మంచికి, మోసానికి మధ్య యుద్ధమన్నారు. ఎన్నికలకు మరో 19 నెలలు ఉన్నందునా… ఇకపై ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు ఇంకా ఎక్కువవుతాయని అన్నారు. ఈ మోసాలను నమ్మవద్దని… మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అనేదే ప్రామాణికం కావాలని అన్నారు. మంచి జరిగితే జగనన్నకు తోడుగా నిలబడండని కోరారు. ప్రత్యర్థులకు అనుకూల మీడియా, దత్తపుత్రుడు ఉంటే.. తనకు ప్రజలే తోడుగా ఉన్నారని అన్నారు.
ఓవైపు తమ ప్రభుత్వం 3 రాజధానులతో అందరికీ మేలు జరుగుతుందని చెబుతుంటే… కాదు, మూడు పెళ్లిళ్లతోనే మేలు జరుగుతుందని కొందరు చెబుతున్నారని పేర్కొన్నారు. పైగా మీరూ మూడు పెళ్లిళ్లు చేసుకోండని ప్రజలకు చెబుతున్నారని… ఇలాంటి మాటలు మాట్లాడితే ఆడవాళ్ల పరిస్థితేమిటని ప్రశ్నించారు. నాలుగైదేళ్లు కాపురం చేసి విడాకులివ్వాలని సలహా ఇస్తున్నారని… అలా అయితే వ్యవస్థ ఏం బాగుపడుతుంది… అక్కాచెల్లెళ్ల మాన ప్రాణాలు ఏం కావాలని నిలదీశారు. వీళ్లా మనకు దశా దిశా చూపేది.. దీనిపై ప్రజలు కాస్త ఆలోచించాలని కోరారు. సీఎం జగన్ తన ప్రసంగంలో ఎక్కడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పేర్లు ప్రస్తావించకుండానే వారిపై విమర్శలు, సెటైర్లు సంధించడం గమనార్హం.
అవనిగడ్డలో భూ యాజమాన్య పత్రాల పంపిణీ :
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను డీనోటిఫై చేసి.. రైతులకు భూయాజమాన్య హక్కు పత్రాలను అందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఒక్క అవనిగడ్డ నియోజకవర్గంలోనే 15,791 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసినట్లు చెప్పారు. తద్వారా 10.019 మంది రైతులకు లబ్ధి చేకూరుతోందన్నారు. ఇకపై ఆ భూములపై వారికే సర్వ హక్కులు ఉంటాయన్నారు. గత ప్రభుత్వంలో రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. మహానేత వైఎస్సార్ ప్రభుత్వం తర్వాత రైతు కష్టాలను అర్థం చేసుకున్నది తమ ప్రభుత్వమేనని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా రాష్ట్రంలో భూములకు కచ్చితమైన రికార్డులు లేవన్నారు. అందుకే భూసర్వే పేరుతో ప్రభుత్వం పెద్ద యజ్ఞం నిర్వహిస్తోందని..దీని ద్వారా 22 వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. భూసర్వే కోసం 15 వేల మంది సర్వేయర్లను నియమించినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాదికల్లా నాటికి 17 వేల గ్రామాల్లో సర్వే పూర్తవుతుందన్నారు.