
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో టాలీవుడ్ అభివృద్ధి, చలనచిత్ర రంగానికి అవసరమైన మద్దతు, భద్రతా సమస్యలు, బెనిఫిట్ షోలకు సంబంధించిన కీలకమైన అంశాలపై చర్చ జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి ఈ సమావేశానికి దూరంగా ఉండటం ప్రధాన చర్చింయాంశంగా మారింది . ఆయన షూటింగ్లో బిజీగా ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. సీనియర్ హీరోలలో కేవలం నాగార్జున, వెంకటేశ్ మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు.
సమావేశంలో ఇండస్ట్రీ అభివృద్ధి అంశాలు ప్రధానంగా చర్చించబడ్డాయి. పరిశ్రమను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడం, హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్‌గా అభివృద్ధి చేయడం, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రోత్సహించడం వంటి ప్రతిపాదనలు వ్యక్తమయ్యాయి.
సండ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో శాంతి భద్రతలపై రాజీ ఉండదని, బౌన్సర్ల వ్యవహారంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.డిజిటల్ విస్తరణపై కూడా చర్చ జరిగింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌కు హైదరాబాద్‌ను కేంద్రంగా చేయాలని దగ్గుబాటి సురేష్ బాబు అభిప్రాయపడ్డారు.ఈ భేటీకి హీరోలలో వరుణ్ తేజ్, నితిన్, సాయిధరమ్ తేజ్, రామ్ పోతినేని తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశం సినీ పరిశ్రమకు అవసరమైన ప్రభుత్వ మద్దతును పునరుద్ఘాటించింది.