
cm jagan review
రాష్ట్రంలో బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విదేశీ బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా.. దేశీయంగానే సమకూర్చేకునేలా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. వేసవి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధంచేసుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. సులియారీ, మహానది కోల్‌బాక్స్ నుంచి పూర్తిస్థాయి ప్రయోజనాలు పొందేలా ఆలోచనలు చేయాలని అధికారులకు సూచించారు. ఇంధనశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని విద్యుత్‌శాఖ అధికారులు సీఎం జగన్ కు వివరించారు.
విద్యుత్ డిమాండ్, కొనుగోళ్లు, మార్కెట్లో అందుబాటులో ఉన్న విద్యుత్, వాటి ధరలు తదితర అంశాలపై డేటా అనలిటిక్స్ ఎస్‌ఎల్‌డీసీలో ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గించుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతోందని వెల్లడించారు. కచ్చితమైన డిమాండ్‌ను తెలిపిపేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని ఉపయోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఎంఓపీఈ 4 నుంచి 5 శాతం ఉంటే, ఇప్పుడు 2 శాతానికి తగ్గిందని.. అధికారులు తెలిపారు.
ట్రాన్స్‌ఫార్మన్ పాడైన 24 గంటల్లోపే కొత్త ట్రాన్స్ఫార్మర్ పెడుతున్నట్లు వెల్లడించారు. దీనివల్ల రైతులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. గడచిన 90 రోజుల్లో 99.5శాతం ట్రాన్స్ఫార్మర్లను 24 గంటల్లోపే రీప్లేస్ చేసినట్లు పేర్కొన్నారు.
మీటర్లు పెట్టుకునేందుకు ఇప్పటికే 16,63,705 మంది అంగీకారం..
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టుకునేందుకు ఇప్పటికే 16,63,705 మంది రైతులు అంగీకరించారని అధికారులు వెల్లడించారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నందున వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు. ఈ సందర్భంగా స్పందించిన సీఎం జగన్.. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ పంపిణీ అత్యంత పారదర్శకంగా, నాణ్యంగా, రైతులకు మేలు చేసేదిగా ఉండాలని స్పష్టం చేశారు. ఇందుకోసం అత్యంత మెరుగైన వ్యవస్థను తీసుకురావాలని చెప్పారు. దీనివల్ల కలుగుతున్న ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు రైతులకు వివరాలు అందజేయాలన్నారు. మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంటు అవసరమో తెలుస్తుందని సీఎం చెప్పారు. దీనివల్ల సరిపడా విద్యుత్‌ను వారికి పంపిణీ చేయడానికి వీలు కలుగుతుందని వివరించారు. దీనివల్ల రైతుల మోటార్లు కాలిపోవు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవు అన్నారు.
రైతులకు ఒక్కపైసా కూడా ఖర్చు కాకుండా విద్యుత్ పంపిణీ సంస్థలే మీటర్లను బిగిస్తాయని సీఎం జగన్ చెప్పారు. వినియోగించుకున్న విద్యుత్‌కు అయ్యే ఖర్చును కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపుతారన్నారు. దీనివల్ల రైతులకు విద్యుత్ పంపిణీ సంస్థలు జవాబుదారీగా ఉంటాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు కారణంగా రైతులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతోందన్నారు జగన్.
800 మెగావాట్ల యూనిట్ అందుబాటులోకి..
కృష్ణపట్నంలో 800 మెగావాట్ల యూనిట్ అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టును ఇదే నెలలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ థర్మల్ పవర్ కేంద్రంలో కూడా మరో 800 మెగావాట్ల కొత్త యూనిట్ కూడా వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేస్తామని వెల్లడించారు. జగనన్న కాలనీల్లో విద్యుత్ సదుపాయం కల్పనపై వివరాలు తెలిపిన అధికారులు.. కాలనీలు పూర్తయ్యే కొద్దీ విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించాలన్నారు.