
cm jagan review
నగరాల్లో పరిశుభ్రత, వేస్ట్ మేనేజ్మెంట్, మురుగునీటి శుద్ధి, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, నగరాలు, పట్టణాల్లో సుందరీకరణ పనులు, పచ్చదనంపెంపు, టిడ్కోఇళ్లు, వైయస్సార్ అర్భన్ క్లినిక్స్, జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్స్ తదితర అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
వర్షాలు బాగా కురుస్తున్నందు వల్ల పట్టణాలు, నగరాల్లో రోడ్ల పరిస్థితిని పరిశీలించాలని సీఎం జగన్ ఆదేశించారు. మార్చి 31 కల్లా అన్నిరోడ్లనూ మళ్లీ బాగు చేయాలన్నారు. గార్బేజ్ స్టేషన్ల కారణంగా పరిసరాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏమాత్రం రాకూడదన్నారు. ఇలాంటి చోట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టి నిర్వహణలో ఎలాంటి స్వచ్ఛ ప్రమాణాలు పాటిస్తున్నామన్నదానిపై అవగాహన కల్పించాలన్నారు. గార్బేజ్ స్టేషన్ల నిర్వహణలోనూ అత్యుత్తమ విధానాలు పాటించాలన్నారు.
ప్రతి మున్సిపాల్టీలో కూడా వేస్ట్ ప్రాసెసింగ్ ప్రక్రియల అమలు తీరును పరిశీలించాలని ఆదేశించారు. ప్రతి మున్సిపాల్టీలో కూడా ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో ఉందా? లేదా? అన్నదానిపై నిరంతరం పరిశీలన చేయాలన్నారు. మున్సిపాల్టీల వారీగా చెత్త శుద్ధిచేసే ప్రక్రియలో ఉన్న సౌకర్యాలు, వసతులు, మురుగునీటి శుద్ధి.. ఈ అంశాల్లో ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలు, కల్పించాల్సిన మౌలికసదుపాయాలపై నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. లేని వాటికి ఆ వసతులను కల్పించుకుంటూ మురుగునీటి శుద్ధి, వేస్ట్ మేనేజ్మెంట్లలో ప్రతి మున్సిపాల్టీ సంపూర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణానది వరద ముంపు రాకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మించిందన్నారు. గోడకు ఇటువైపున మురుగునీరు చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రిటైనింగ్ వాల్ బండ్‌ను చెట్లు, విద్యుత్ దీపాలు, ఏర్పాటుచేసి అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
“ప్లాస్టిక్ ప్లెక్సీలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. దీన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి సంబంధిత వ్యాపారులతో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించాలి. ప్లాస్టిక్ నుంచి క్లాత్ వైపు మళ్లడానికి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు అవసరమైన విధంగా వారికి తోడుగా నిలవాలి. రుణాలు ఇప్పించి వారికి అండగా నిలవాలి. ఇప్పించిన రుణాలను సకాలంలో కట్టేవారికి ప్రభుత్వం నుంచే వడ్డీ రాయితీ కల్పించేలా ఆలోచనలు చేయాలి.” – సీఎం జగన్
జగనన్న కాలనీల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు సీఎం జగన్. కాలక్రమేణా వీటిని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. పెద్ద కాలనీలు నిర్మాణం పూర్తయ్యే కొద్దీ.. కాలనీల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలో నీళ్లు, డ్రైనేజీ, కరెంటు ఏర్పాటుచేసి తర్వాత మురుగునీటి శుద్ధి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లే రహదారికి ఇరువైపులా సుందరీకరణ పనులపై అధికారులు సీఎం జగన్ కు వివరించారు. అంబేద్కర్ పార్కుకు వెళ్లే రోడ్లను అందంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా సీఎం జగన్ ఆదేశించారు. వీటి తర్వాత విశాఖపట్నంలో సుందరీకరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక లే అవుట్‌ను తీర్చిదిద్దాలని సీఎం జగన్ ఆదేశించారు. జిల్లాల వారీగా కలెక్టర్లతో దీనిపై సమీక్ష చేసి, ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.