
CM Jagan review
ఈ నెల 15వ తేదీలోగా రైతుల అథంటికేషన్ పూర్తిచేసి, వారికి డిజిటల్, ఫిజికల్ రశీదులు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. పకడ్బందీగా సోషల్ ఆడిట్ కూడా పూర్తిచేయాలన్నారు. నిర్దేశించుకున్న టైంలైన్ ప్రకారం ఈ ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. ఇ–క్రాపింగ్ తీరును అధికారులు వివరించిన సమయంలో సీఎం జగన్ ఈ విషయాలను స్పష్టం చేశారు. సాగుచేసిన పంటల్లో వీఏఏ, వీఆర్ఓలు 99 శాతానికిపైగా ఆధీకృతం పూర్తిచేసినట్లు చెప్పారు. ధాన్యం సేకరణ, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలపై వ్యవసాయ, పౌరసరఫరాలశాఖలతో క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
సమీక్ష నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులను సీఎంకు అధికారులు వివరించారు. ఖరీఫ్‌లో ఇప్పటివరకూ 1.10 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయగా.. ఇంకా అక్కడక్కడా నాట్లు కొనసాగుతున్నట్లు చెప్పారు. సాధారణ సాగు 1.15 కోట్ల ఎకరాలకు ఈ సీజన్లో చేరుకుంటుందని సీఎంకు అధికారులు పేర్కొన్నారు. గడచిన మూడేళ్లలో 3.5లక్షల ఎకరాల్లో ఉద్యానవన సాగు పెరిగినట్లు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. రబీ సాగు అంచనాలకు కూడా అధికారులు సీఎంకు వివరించారు.
ఖరీప్ ధాన్యం కొనుగోళ్లపై..
ఖరీఫ్ లో 14.10 లక్షల హెక్టార్లలో వరి పండించినట్లు అంచనా వేశారు అధికారులు. నవంబరు మొదటివారం నుంచి కొనుగోళ్లు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లకోసం 3,423 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం సీఎం జగన్ స్పందించారు. ఇ–క్రాపింగ్ చేయడం వల్ల ధాన్యం కొనుగోళ్లలో పూర్తిస్థాయిలో పారదర్శకత వచ్చిందన్నారు. ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏ రైతు కూడా ఎక్కడా ఫిర్యాదు చేయకూడదని సీఎం ఆదేశించారు. గన్నీబ్యాగులు, కూలీలు, రవాణా.. అవసరమైన మేరకు ఇవన్నీ కూడా సమకూర్చుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో సాయం కోసం తీసుకుంటున్న వారిని రైతు సహాయకులుగా వ్యవహరించాలన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఆర్బీకేల్లో పోస్టర్లుకూడా పెట్టాలన్నారు. రాష్ట్రంలో విస్తారంగా వరి సాగు అవుతున్నందున బియ్యం ఎగుమతులపైనా దృష్టిపెట్టాలన్నారు. దేశీయంగా డిమాండ్ లేని పరిస్థితుల్లో విదేశాలకు ఎగుమతిచేసే అవకాశాలపైనా దృష్టిపెట్టాలన్నారు. ఈ విషయంలో ఎగుమతులు రంగంలో ఉన్న ఇతర కంపెనీలతో కలిసి పనిచేయాలని సీఎం పేర్కొన్నారు.
బ్రోకెన్ రైస్‌ను ఇథనాల్ తయారీకి వినియోగించడంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఇఫ్కో ద్వారా ఒక ప్లాంటు, మహీంద్రా ద్వారా మరో ప్లాంటు నుంచి ఇథనాల్ తయారీ కాబోతుందని సీఎం చెప్పారు. రంగు మారిన ధాన్యం, బ్రోకెన్ రైస్ నుంచి ఇథనాల్ తయారీపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎక్కడైనా పంటలకు ఎంఎస్పీ కన్నా తక్కువ వస్తుందని అంటే.. కచ్చితంగా జోక్యంచేసుకుని ఎంఎస్పీ ధరలకు కొనుగోలు చేయాలన్నారు.
కొనుగోలు చేసిన సరుకును నిల్వచేసే ప్రాంతంలో జియోఫెన్సింగ్, అలాగే ఉత్పత్తులకు క్యూ ఆర్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాలశాఖను ఆదేశించారు సీఎం జగన్. పొగాకు రైతులకు నష్టం రాకుండా తగిన రీతిలో చర్యలు తీసుకోవాలన్నారు. రైతులను ఆదుకునేందుకు మార్కెట్లో నిరంతరం జోక్యం చేసుకోవాలన్నారు. దీనివల్ల ధరలు పతనం కాకుండా రైతులకు మేలు జరుగుతుందన్నారు.
అక్టోబరు 17న రైతు భరోసా రెండో విడత
అక్టోబరు 17న రైతు భరోసా రెండో విడతకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. వైఎస్సార్ యంత్రసేవకు సంబంధించిన పోస్టర్లను ఆర్బీకేల్లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఆర్బీకేల్లో సేవలందిస్తున్న వారిని ఆర్బీకే మిత్రలుగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
సాయిల్ డాక్టర్ విధానంపై..
ఖరీఫ్ ప్రారంభం కాకముందే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు పూర్తికావాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి ఏటా కూడా ఇలాగే పరీక్షలు చేయాలన్నారు. దీనికి సంబంధించిన వివరాలను సంబంధిత కార్డులో రికార్డు చేయాలన్నారు. భూసార పరీక్ష ఫలితాలను పరిగణలోకి తీసుకుని ఎలాంటి పంటలు వేయాలి? ఎంత మోతాదులో ఎరువులు వేయాలన్న దానిపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఆర్బీకేలో సాయిల్ టెస్టింగ్ డివైజ్ పెట్టాలన్నారు. దీనివల్ల విచక్షణ రహితంగా ఎరువులు, రసాయనాల వాడకం తగ్గుతుందన్నారు. తద్వారా రైతులకు పెట్టబడులుతగ్గి, ఖర్చులు తగ్గుతాయన్నారు.