
cm jagan review
రాష్ట్రంలో బడులు ప్రారంభమ్యయే తొలిరోజునే విద్యాకానుక కిట్ ఇస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. ఇందులో భాగంగా స్కూల్ బ్యాగు, బైలింగువల్ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, షూ, సాక్సులు, బెల్టు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వీటన్నింటినీ ఒకేసారి పిల్లలకు స్కూల్ ప్రారంభించే తొలిరోజే అందిస్తున్నామని, గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
గతంలో స్కూల్ పిల్లలకు సెప్టెంబరు, అక్టోబరు వరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వని పరిస్థితి నెలకొందని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ విధానంలో మార్పు తెచ్చినట్లు సీఎం జగన్ చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలు, వారి తల్లిదండ్రుల్లో నైతిక స్థైర్యం దెబ్బతినేలా వ్యతిరేక మీడియా రాస్తున్నట్లు చెప్పారు.
సెకెండ్ సెమిస్టర్ ప్రారంభం అయినా.. ఇంకా పుస్తకాలు అందలేదంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఈ సందర్భంగా అధికారులు ఖండించారు. డిసెంబరులో సెకెండ్ సెమిస్టర్ ప్రారంభం అవుతుందని, అలాంటిది ఇప్పుడే పుస్తకాలు అందలేదని రాయడం కచ్చితంగా తప్పుదోవ పట్టించడమేనని అధికారులు పేర్కొన్నారు. డిసెంబర్లో రెండో సెమిస్టర్ ప్రారంభం అవుతుందన్న విషయాన్ని అకడమిక్ క్యాలెండర్లో పేర్కొన్నామని, ఈ విషయం తెలిసి కూడా విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా కథనాలను వ్యతిరేక మీడియా రాస్తుందన్నారు అధికారులు.
వాస్తవాలను ఇలా వక్రీకరించడంతో పాటు… ప్రభుత్వ స్కూళ్లకు వెళుతున్న పిల్లల నైతిక స్థైర్యం దెబ్బతినేలా ఒక పద్ధతిప్రకారం వ్యతిరేక వార్తలు రాస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. ఇంగ్లిషు మీడియంకు, ప్రభుత్వ విద్యారంగానికి వారు వ్యతిరేకం కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలు రాసి ప్రచారం చెస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పేద పిల్లలకు ఇంగ్లిషు మీడియం విద్య అందడం వాళ్లకి ఇష్టం లేదు కాబట్టే.. వ్యతిరేక వార్తలు రాస్తున్నట్లు చెప్పారు.
ఇంకా మొదలు కాక ముందే రెండో సెమిస్టర్ ప్రారంభం అయిందని వార్తలు రాయడంలో ఉద్దేశం.. కచ్చితంగా తప్పుదోవ పట్టించడమే అన్నారు. రాకీయంగా తనను ఇబ్బందిపెటాలి కాబట్టి, ఇలాంటి కథనాలు రాస్తున్నట్లు సీఎం చెప్పారు. రాజకీయంగా జరుగుతున్న ఈ యుద్ధంలో.. దురదృష్టవశాత్తూ సామాన్యులు, తల్లిదండ్రులు, బడిపిల్లలు ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు.