
Land implications
- చుక్కల భూముల చిక్కుల పరిష్కారంపై చర్యలు
- విశ్రాంత న్యాయమూర్తుల ఆధ్వర్యంలో పరిశీలన
- క్రయవిక్రయాలకు వీలు కల్పించేలా అడ్డంకుల తొలగింపు
- 22ఏ దరఖాస్తుల పరిష్కారంపై సీఎం జగన్ ఫోకస్
అవి పేదలు, స్వతంత్ర సమరయోధులు, ఎక్స్ సర్వీస్ మెన్, రాజకీయ బాధితులకు చెందిన భూములు. అవి వారి సొంత భూములైనా క్రయవిక్రయాలు జరుపుకోవడానికి వీల్లేని నిషేధిత జాబితాలో ఉన్నవి. దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారినా భూముల హక్కుదారులకు ఎలాంటి ప్రయోజనం కలిగించలేదు. నిషేధిత భూములు ఉపయోగించుకోవడానికే మినహా అవసరాలకు అమ్ముకునే అవకాశం లేనివి. ఈ భూముల క్రయవిక్రయాలకు అవకాశం కల్పించాలని కోరుతూ ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది దరఖాస్తులు చేసుకుంటూనే వస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం కూడా వారి సమస్యపై దృష్టి సారించి, పరిష్కరించేందుకు చర్యలు తీసుకోలేదు. ఇన్నేళ్ల తర్వాత ప్రస్తుత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ భూముల సమస్య పరిష్కారం దిశగా ముందడుగు వేసింది.
ఏమిటీ నిషేధం?
నిషేధిత భూముల చట్టానికి దాదాపు వంద సంవత్సరాలకుపైగా చరిత్ర ఉంది. గతంలో పలు ప్రభుత్వాలు పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములు, స్వాతంత్ర్య సమరయోధులకు ఆయా ప్రభుత్వాలు ఇచ్చిన స్థలాలు, ఎక్స్ సర్వీస్ మెన్ కు అందించిన భూములు, రాజకీయ బాధితులు, ఇతర పలు వర్గాలకు ప్రభుత్వాలు కేటాయించిన స్థలాలు ఈ జాబితాలోకి వస్తాయి. ప్రధానంగా 1954కు ముందు పేదవారికి ఇచ్చిన భూములను వివిధ కారణాలతో నిషేధిత చట్టం పరిధిలోకి తెచ్చారు. 1908లో తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఏ భూముల క్రయవిక్రయాలపై, వాటి రిజిస్ట్రేషన్లపై నిషేధాన్ని విధిస్తుంది. ఈ కారణంగా తమ సొంత భూములను విక్రయించుకోలేని పరిస్థితుల్లో ఎంతో మంది ప్రభుత్వాన్ని ఆశ్రయించారు.
లక్షలాది మంది కోరిక..
ప్రభుత్వాలు కేటాయించిన భూములు నిషేధిత జాబితాలో ఉండటం వల్ల క్రయవిక్రయాలు సాధ్యపడటం లేదు. కనుక ఆ జాబితా నుంచి తమ భూములను తొలగించాలని లక్షలాది మంది భూ యజమానులు ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. వీటిని పరిష్కరించాలన్న ధృడ సంకల్పంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధ్యయనం చేయడానికి కమిటీలు నియమించింది.
పట్టించుకోని గత ప్రభుత్వాలు
గత టీడీపీ ప్రభుత్వంలోనూ ఇలాంటి విజ్ఞప్తులు వేలాదిగా వచ్చినా ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం అన్ని రకాల అవకాశాలను పరిశీలించి వందేళ్ల చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోన్ల వారీగా కమిటీలు నియమించి, క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని ఆదేశించారు. తొలి దశలో విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం కేంద్రాలుగా ఈ కమిటీలు అధ్యయనం చేయనున్నాయి. ఈ కమిటీల్లో విశ్రాంత జిల్లా న్యాయమూర్తి, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, భూరికార్డుల శాఖ విశ్రాంత ఏడీ, సర్వే విభాగం ఏడీ, సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ లేదా ఆర్డీవో, జిల్లాల రిజిస్ట్రార్లు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీలకు ప్రభుత్వమే వేతనాలు చెల్లించేలా జీవో 681ని విడుదల చేశారు.
రికార్డుల పరిశీలనతో అడుగులు..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు పెండింగ్ లో ఉన్న ప్రతి కేసును కూలంకుషంగా అధ్యయనం చేస్తాయి. వాటికి సంబంధించి ఉన్న అన్ని రికార్డులను అధికారుల సమక్షంలో పరిశీలిస్తాయి. కమిటీలు గుర్తించిన అంశాలతో నివేదికలు రూపొందించి జిల్లా కలెక్టర్లకు సిఫారసు చేస్తాయి. కలెక్టర్ స్థాయిలో పరిశీలించి వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించేలా సిఫార్సులు ఉండాలి. ఒకవేళ కలెక్టర్ స్థాయిలో పరిష్కరించలేనివి ఉంటే వాటిని ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. అదే విధంగా రూ. 50 కోట్లకు పైగా విలువైన భూములుంటే వాటిని సీసీఎల్ఏ ద్వారా ప్రభుత్వానికి తెలపాలి. ఈ విధంగా వందేళ్లుగా పెండింగ్ లో ఉన్న అసైన్డ్ భూముల సమస్యలను పరిష్కరించి, నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలనే చిత్తశుద్ధితో ప్రభుత్వం పని చేస్తోంది. తద్వారా లక్షలాది మంది తమ భూముల క్రయవిక్రయాల కోసం రిజిస్ట్రేషన్ల విషయంలో ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలని భావిస్తోంది. అతి త్వరలో ప్రభుత్వం నియమించిన కమిటీలు సమావేశమై యుద్ధప్రాతిపదికన ఫిర్యాదులను పరిశీలించి నివేదికలు రూపొందించనున్నాయి.