
ys jagan
తిరుమల శ్రీవారిని సీఎం వైఎస్ జగన్ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు రంగనాయకుల మండపంలో సీఎంకు వేద ఆశీర్వచనం, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తొలుత ఆలయం వద్ద సీఎం జగన్ కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. తర్వాత నూతన పరకామణి భవనంతో పాటు నూతన అతిథి గృహాన్ని సీఎం ప్రారంభించారు. దాదాపు రూ.22 కోట్లతో అత్యాధునికంగా నూతన పరకామణి భవనాన్ని నిర్మించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం జగన్.. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. ప్రతిఏటా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువ్రస్తాలను సమర్పిస్తుంటారు. అందులో భాగంగానే మంగళవారం బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా.. సీఎం జగన్ రాత్రి ఆలయ సంప్రదాయాల ప్రకారం శ్రీవారికి పట్టు వ్రస్తాలను తీసుకొచ్చారు. సీఎం హోదాలో జగన్ ఇలా శ్రీవారికి పట్టు వ్రస్తాలు సమర్పించడం ఇది నాలుగవసారి కావడం గమనార్హం.
పట్టువస్త్రాలను తలపై పెట్టుకున్న ముఖ్యమంత్రి వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, ఆశ్వ, గజరాజులు వెంటరాగా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. బలిపీటానికి, ధ్వజస్తంభానికి మొక్కుకుని వెండివాకిలి మీదుగా బంగారువాకిలి చేరుకుని గరుడాళ్వార్ను దర్శించుకున్నారు. అనంతరం అర్చకులకు పట్టువస్త్రాలను అందజేశారు.