
cm jagan review
వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీలో మరిన్ని వైద్య చికిత్సలను చేర్చుతూ ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయం తీసుకోగా.. పెంచిన చికిత్సలకు సంబంధించిన సేవలను శుక్రవారం ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ కింద కొత్తగా 809 వైద్య చికిత్సలను చేర్చగా.. మొత్తం చికిత్సలు 3,255కి చేరాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరోగ్య శ్రీ కింద పెరిగిన చికిత్సలు 2,196 అని గణాంకాలు చెబుతున్నాయి. 2019 మే నాటికి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కింద 1059 చికిత్సలు ఉండేవి.
జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక.. క్రమంగా సేవలను పెంచుతూ వస్తున్నారు. జనవరి 2020లో 2059 చికిత్సలకు పెంచగా.. జులై 2020లో 2200కు.. నవంబర్2020 లో 2436కు పెంచారు. అలా పెంచుతూ.. 2022 నాటికి 3255 చికిత్సలకు పెంచారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో పెంచిన వైద్య చికిత్సల కారణంగా ఏడాదికయ్యే ఖర్చు రూ.2894.87 కోట్లు కాగా.. ఆరోగ్య ఆసరా కోసం(2021–22లో) సుమారు రూ. 300 కోట్లు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా..
ఖర్చుకు వెనకాడకుండా ఆరోగ్య శ్రీ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ అన్నారు. ఎక్కడా కూడా బకాయిలు లేకుండా చూస్తున్నట్లు చెప్పారు. ఎంపానెల్డ్ ఆస్పత్రుల్లో నమ్మకం, విశ్వాసం కలిగిందని చెప్పారు. ఇప్పుడు రోగులకు మరిన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు వివరించారు.
104 కాల్‌సెంటర్ ద్వారా ఆరోగ్యశ్రీ రిఫరల్ సర్వీసులు కూడా అందిస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు.. సీఎం జగన్ కు వివరించారు. ఆరోగ్య శ్రీ కింద అందుతున్న సేవలపై ఎంపానల్డ్ ఆస్పత్రులు, విలేజ్ క్లినిక్స్, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో బోర్డులు ఉంచుతున్నట్లు చెప్పారు. పూర్తి సమాచారంతో బుక్లెట్స్ కూడా ఇస్తున్నామన్న అధికారులు.. ఆస్పత్రులు వివరాలు, అందుతున్న సర్వీసుల వివరాలు కూడా ఇందులో ఇస్తున్నట్లు వివరించారు.
ఇతర రాష్ట్రాల వారికి కూడా..
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కారణంగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు గాయపడితే అలాంటి వారికి వెంటనే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలని సీఎం ఆదేశించారు. ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య మిత్రలకు సేవా మిత్రలు, సేవారత్న, ఉన్నత ఆరోగ్య సేవ అవార్డులు అందిస్తామన్నారు.
వైద్య ఆరోగ్య రంగంలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకు వచ్చామన్నారు సీఎం జగన్. భారీ సంఖ్యలో మునుపెన్నడూలేని విధంగా సుమారు 46వేల పోస్టులను భర్తీ చేశామన్నారు. ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన సేవలు అందాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఆరోగ్యవంతమైన సమాజంతో మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ ఖాళీ ఉన్నా వెంటనే గుర్తించి వాటిని భర్తీచేసేందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమించినట్లు చెప్పారు. ఇక అంకిత భావంతో పనిచేసి, ప్రత్యేక శ్రద్ధతో ఈ వ్యవస్థలను మెరుగ్గా పనిచేయించడంపై దృష్టిపెట్టాలన్నారు. ఎక్కడా కూడా అలసత్వానికి, నిర్లక్ష్యానికి తావు ఉండకూడదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్పత్రుల్లో ఉండాల్సిన సంఖ్యలో వైద్యులు ఉండాలని సీఎం ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖలో కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరును తప్పనిసరి చేయాలన్నారు.
విలేజ్ క్లినిక్స్‌లో మందులు సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే సిబ్బందిపై కూడా మండలస్థాయిలో పర్యవేక్షణకు అధికారిని నియమించాలనే దానిపై ఆలోచన చేయాలన్నారు. దీనిపై సరైన కసరత్తు చేసిన ప్రతిపాదనలు తనకు అందించాలన్నారు.
ఎయిర్ పొల్యూషన్, పారిశుద్ధ్యం, తాగునీరు, స్కూళ్లు, అంగన్వాడీలలో టాయిలెట్ల పరిశుభ్రతపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. క్రమం తప్పకుండా ఈ నివేదికలు తెప్పించుకుని, గుర్తించిన సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రక్తహీనత కేసులను జీరోకి తీసుకు రావాలని సీఎం సూచించారు.