
YSRCP BC meeting
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తాడేపల్లిలో బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బీసీ మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, గుమ్మనూరు జయరాం, వేణుగోపాలకృష్ణ, ఎంపీలు గోరంట్ల మాధవ్, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పోతుల సునీత, అన్ని కార్పోరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు తదితరులు హాజరై.. బీసీల కోసం సీఎం జగన్ ను కొనియాడారు. బీసీల కోసం సీఎం జగన్ ఏం ఏం చేశారో.. మంత్రులు, నాయకులు వివరించారు. వారి మాటల్లోనే సీఎం జగన్ బీసీలకు ఏం చేశారో తెలుసుకుందాం.
బలహీన వర్గాల ఆశాజ్యోతి..
ఆంధ్రప్రదేశ్లో జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ సర్కారు బలహీన వర్గాలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తోంది. సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే బీసీ వర్గాలకు అన్నింటా పెద్దపీట వేస్తూ.. బీసీ బంధువుగా మారారు. ఓటర్లుగా కాదు, పాలకులుగా బలహీనవర్గాలు ఉండాలన్నదే జగన్ ఆకాంక్ష.. అందుకే దేశ చరిత్రలో ఏ సీఎం చేయని విధంగా 70% మంత్రి పదవుల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో భర్తీ చేశారు. మొత్తంగా 25 మందిలో 11 మంది బీసీ మంత్రులున్నారు. ఇటు లోక్ సభలో 9 మంది, రాజ్యసభలో 5 మంది ఎంపీలున్నారు. ఎమ్మెల్యేల్లో 28 మంది, ఎమ్మెల్సీల్లో 14 మంది, జెడ్పీటీసీల్లో 208 మంది బీసీలే.. అలాగే 8 మంది మేయర్లు, 42 మంది ప్రభుత్వ కార్పొరేషన్ చైర్ పర్సన్లు బలహీన వర్గాల వారే కావడం విశేషం.
ఆనాడు జగన్ ఏలూరులో బీసీ గర్జన సభ పెట్టి, అధికారంలోకి రాగానే, బీసీలకు అన్నింటా పెద్దపీట వేస్తామని.. వారికి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా న్యాయం చేస్తామని డిక్లరేషన్ ప్రకటించారు. దానికి ఆయన కట్టుబడి పాలనలో చేసి చూపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నియామకాల్లో కూడా బీసీలకు జగన్ అగ్రతాంబూలం ఇచ్చారు. గ్రామ సచివాలయాల ఉద్యోగాల్లో 50 శాతం బీసీలకే ఇచ్చిన వైఎస్సార్ సీపీ సర్కారు.. 137 నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకే 56 శాతం కేటాయించగా వాటిలోనూ 50 శాతానికిపైగా మహిళలకు ఇవ్వడం ప్రత్యేకత.. ఇటు బీసీ వర్గాల్లోని 139 ఉపకులాలను వెతికి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, 56 మందిని చైర్మెన్లను, 672 మందిని డైరెక్టర్లను నియమించింది. ఇటు బీసీలకు రూ.5 లక్షల వరకు తాకట్టు లేని ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు) రుణాలు వైఎస్సార్ సీపీ సర్కారు ఇస్తోంది. బీసీలకు 50% పారిశ్రామిక ప్లాట్లు కేటాయిస్తోంది.
సంక్షేమ పథకాల్లోనూ బీసీలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది. దర్జీ, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ‘చేయూత’ ఇస్తోంది. అలాగే నేతన్నలకు ‘నేస్తం’గా మారింది. శాశ్వత బీసీ కమిషన్, కుల వృత్తుల వారీగా రూ.10 లక్షల దాకా బీమా కల్పిస్తోంది. ఇటు అవ్వాతాతలకు ఆసరా పెన్షన్ల నుంచి వైఎస్సార్ సున్నా వడ్డీ, కల్యాణ కానుకల దాకా.. జగనన్న విద్యా దీవెన నుంచి వసతి దీవెన వరకూ.. ఇటు వైఎస్సార్ విద్యోన్నతి నుంచి అంబేడ్కర్ విదేశీ విద్యా నిధి దాకా.. ఎన్నెన్నో పథకాలు.. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు వైఎస్సార్ సీపీ సర్కారు అమలు చేస్తోంది. ఇప్పటివరకు సంక్షేమ పథకాల ద్వారా రూ.50,000 వేల కోట్ల డబ్బు నేరుగా బీసీల చేతికందిందంటేనే జగన్ సర్కారు చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది.
బీసీలకు జగన్ ఇంతచేస్తున్నా.. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండటం సిగ్గుచేటు.. 14 ఏళ్ళ పాటు సీఎంగా ఉండి చంద్రబాబు బీసీలకు పెద్దగా చేసిందేమి లేదు. బీసీలను ఓట్లు వేసే యంత్రాల్లా వాడుకున్నారే తప్ప.. రాజకీయంగా, ఆర్థికంగా వారికి లబ్ధి చేకూర్చేలా ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. అధికారంలో ఉన్నన్నాళ్ళూ బీసీలను చిన్నచూపు చూస్తూ.. ఆ వర్గాలకు ఏదో మొక్కుబడిగా మంత్రి పదవులిచ్చారు. కనీసం తన పార్టీలో కూడా మెజార్టీ పదవులు బీసీలకు ఇవ్వలేదు. బీసీలు జడ్జిలుగా పనికిరారంటూ కేంద్రానికి ఆనాడు లేఖలు రాసింది ఈ చంద్రబాబే.. బడుగు, బలహీన వర్గాల పిల్లల అభ్యున్నతి కోసం వైఎస్సార్ సీపీ సర్కారు ఇంగ్లీషు మీడియం విద్యను తేవాలనుకుంటే.. దాన్ని వ్యతిరేకిస్తూ శాసనమండలిలో బిల్లును పాస్ చేయకుండా వెనక్కి పంపింది బీసీ ద్రోహులతో కూడిన ఈ టీడీపీయే.. ఇవన్నీ గమనిస్తూనే ఉన్న బీసీ ఓటర్లు మెల్లిమెల్లిగా టీడీపీని దూరం పెడుతున్నారు.