
సంక్షేమం, అభివృద్ధి పరిపాలనను ప్రజలకు అందించాల్సిన నిర్ణయం తీసుకున్న రోజుగా 2020 డిసెంబరు 25 ప్రజలందరికీ గుర్తుండిపోతుంది.
ఇళ్లు లేని నిరుపేదలకు గృహవసతి కల్పించాలనే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రోజది. ఆ రోజు చేసిన ఆలోచనతో
ఇళ్ల స్థలాలను ఉచితంగా పంపిణీ చేసి ఆంధ్రప్రదేశ్‌లో చరిత్ర సృష్టించారు. నాటి నుంచి నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 30.68 లక్షల మంది లబ్ధిదారులకు పట్టాలు అందించారు. వీటిలో మొదటి దశలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అలాగే ఒక్కో ఇంటిని రూ. 1.80 లక్షల వ్యయంతో నాణ్యతలో రాజీ లేకుండా నిర్మించి ఇస్తున్నారు.
భూసేకరణ చిన్న విషయం కాదు
రాష్ట్రంలో 66,518 ఎకరాల భూమిని సేకరించడం, ఆ మొత్తాన్ని నివాస స్థలాలుగా మార్చడం సాధారణ విషయం కాదు. ఇళ్ల స్థలాలను జియో ట్యాగింగ్ చేసి, చదును చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టడం మహాయజ్ఞమే. ఇప్పటికే పేదలకందించిన భూమి మార్కెట్ విలువ దాదాపు రూ. 23,000 కోట్లు ఉంటుంది.
పాదయాత్రలో నవరత్నాల ఆలోచన
వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ఈ యజ్ఞం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 125 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ కాలినడకన ఆయన ప్రజల వద్దకు వెళ్లారు. 341 రోజులపాటు 3648 కిలోమీటర్ల మేరకు చేసిన పాదయాత్రలో ఆయన దాదాపు 2 కోట్ల మందిని ప్రత్యక్షంగా కలిసి వారి బాధలు తెలుసుకున్నారు. అదే సమయంలో ప్రజల పట్ల టీడీపీ ప్రభుత్వ అవినీతి విధానాలను స్వయంగా చూశారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న జగన్ ఆనాడే ప్రజలకు హామీ ఇచ్చారు.
సంక్షేమం, వ్యవసాయం, విద్యపై పూర్తిగా దృష్టి సారించే పాలనను తీసుకు వస్తానని, ఆరోగ్యం, విద్యుత్, నీటిపారుదల, పరిశ్రమలు తెచ్చి రాష్ట్ర ప్రగతికి చర్యలు తీసుకుంటానన్నారు. ఎన్నికలలో నవ రత్నాల సంక్షేమ పథకాలను ప్రకటించారు.
చెప్పాడంటే.. చేస్తాడంటే..
ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం దాదాపు రూ. 1.30 లక్షల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వంగా చరిత్ర సృష్టించారు. సంక్షేమం విషయంలో కోవిడ్ కష్ట సమయాల్లో కూడా వెనకడుగు వేయలేదు. “చెప్పాడంటే – చేస్తాడంతే” అనే నినాదమే ఊపిరిగా గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించి దాదాపు 25 శాతం మందికి సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఉచితంగా ఇళ్లను అందిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్నది కేవలం సొంత ఇల్లు కాదు వారి జీవన ప్రమాణాలను మార్చేయడమని నిరూపిస్తున్నారు. ఇళ్ల పట్టాలు కానీ, ఇళ్లను కానీ ఇంట్లోని మహిళలకే అందించడం ద్వారా ఈ పథకం మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తోంది. మరోవైపు జగనన్న కాలనీల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి, వాటిని ఇళ్లుగా కాకుండా ఊళ్లుగా తీర్చిదిద్దుతున్నారు. 30 లక్షలకు పైగా నిజమైన లబ్ధిదారులను గుర్తించడం చాలా పెద్ద పని. ప్రతి ఒక్క లబ్ధిదారుడి అర్హతా ప్రమాణాలను పరిశీలించి తుది ఆమోదం ఇవ్వడానికి రెండు లేదా మూడుసార్లు అధ్యయనం చేశారు. గ్రామ వాలంటీర్, ఉన్నతాధికారులు స్వయంగా సందర్శించి అర్హతను నిర్ధారించారు. ఇలా 2020 డిసెంబర్లో మొదలైన మహాయజ్ఞం నిరంతరాయంగా కొనసాగుతూ పేదల కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసి, వారి మోముల్లో చిరునవ్వులు పూయిస్తోంది.