
minister jogi ramesh
2019 ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీల్లో 98 శాతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. గత ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను ఏదో రకమైన వంక పెట్టి వారికి ఆ ఫలాలు దక్కకుండా ఎలా కత్తిరించాలనే ఆలోచనతో పరిపాలన చేయగా.. వైసీపీ ప్రభుత్వం అర్హులను అన్వేషించి మరీ లబ్ధి చేకూర్చుతోందన్నారు. పారదర్శక పాలన అంటే ఇదే అన్నారు మంత్రి జోగి రమేష్.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పెడన పురపాలక పరిధిలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను వారికి వివరించారు. ప్రజలు పొందిన లబ్ధి వివరాలతో కూడిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన కరపత్రాలను అందచేశారు. వైసీపీ ప్రభుత్వం రావడం వలన ఇన్నిన్ని ప్రయోజనాలు చేకూరడం జరిగాయనే ప్రయత్నం చేశారు.
అనంతరం మంత్రి మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. జగన్ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ప్రజాబలంతో హిమాలయ పర్వతమంత ఎదిగిన జగన్ ను ఎదుర్కోలేని ప్రతిపక్ష నాయకులు.. వైసీపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలా పలు కుట్రలు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. అయితే అత్యధిక శాతం మంది ప్రజలు మంచి చేసే తమ వైపే ఉన్నారని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా అది నిత్యం తేటతెల్లమవుతుందని మంత్రి జోగి రమేష్ అన్నారు.