
cm jagan
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో ఏర్పాటు చేసిన ఏపీజెన్కో ప్రాజెక్టు మూడో యూనిట్(800 మెగావాట్లు) జాతికి అంకితం చేశారు సీఎం జగన్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఏపీ జెన్కో స్వయంగా నిర్మించిన ఈ థర్మల్ పవర్ స్టేషన్‌కు దామోదరం సంజీవయ్య పేరు పెట్టారు. ఈ థర్మల్ స్టేషన్ ను రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి రంగంలో మరో ముందడుగుగా సీఎం జగన్ అభివర్ణించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు.
ఈ థర్మల్ పవర్ స్టేషన్‌కు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత నేత రాజశేఖరరెడ్డి గారు 2008లో శంకుస్ధాపన చేసినట్లు చెప్పారు జగన్. ఈ పవర్ స్టేషన్‌కు మన రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య పేరు పెట్టుకున్నట్లు చెప్పారు. దేశంలో తొలిసారి ప్రభుత్వం రంగంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్‌స్టేషన్ నిర్మాణానికి రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వినియోగదారులందరికీ రోజంతా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ థర్మల్ పవర్ స్టేషన్‌లోని ఈ ప్రాజెక్టుకు రూ.3200 కోట్లు యుద్ధప్రాతిపదికన ఖర్చు చేశామన్నారు. 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేశామన్నారు.
రాష్ట్ర విద్యుత్ అవసరాలలో దాదాపు 45 శాతం కరెంటు ప్రభుత్వరంగ విద్యుత్ సంస్ధలే ఉత్పత్తి చేస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. ఈ రోజు జాతికి అంకితం చేసిన ఈ ప్లాంటు నుంచి రోజుకి 19 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఏపీ గ్రిడ్‌కు ఇక్కడ నుంచి సరఫరా అవుతుందన్నారు. సాధారణ థర్మల్ విద్యుత్ ప్లాంటుతో పోల్చితే సూపర్ క్రిటికల్ ప్లాంటు తక్కువ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. దీనివల్ల వెలువడే కాలుష్యం తగ్గుతుందన్నారు. ఒకవైపు కృష్ణపట్నం పోర్టు, మరోవైపు థర్మల్ పవర్ ప్లాంటు కోసం భూములిచ్చిన రైతులను ప్రత్యేకంగా అభినందించారు సీఎం జగన్.
“ఎన్నికల వేళ మీకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి ఇక్కడకి వచ్చాను. ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబునాయుడు గారికి మేమంతా గుర్తుకు వస్తాం. ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనలో చేసిన మంచేమీ లేకపోయినా.. హడావుడిగా ఎన్నికలప్పుడు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ మళ్లీ మోసం చేసే ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఆ రోజు నేను మీ అందరికీ నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని చెప్పాను. ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇవాళ 16,337 మత్స్యకారేతర కుటుంబాలు అందరికీ కూడా బటన్ నొక్కి నేరుగా.. రూ.36 కోట్లు వాళ్ల బ్యాంక్ అకౌంట్లో జమ చేసే కార్యక్రమం చేస్తున్నాం.” – సీఎం జగన్
ఆనాడు చంద్రబాబు ఎన్నికల్లో లబ్ధి పొందడానికే హడావుడిగా.. కేవలం 3,500 మందికి అది కూడా రూ.14,000 కూడా సరిగా ఇవ్వలేదన్నారు సీఎం జగన్. ఈ రోజు వాళ్లకి మిగతా సొమ్ము ఇవ్వడమే కాకుండా మిగిలిపోయిన ఆ 12,787 కుటుంబాలకు కూడా మంచి చేస్తూ… మొత్తం అందరికీ కూడా ఈ ప్యాకేజీ ఇస్తున్నామని జగన్ ప్రకటించారు.