
cm jagan appoints single member commission to submit report over inclusion of valmiki boya in st category
దీపావళి పండగ ముందు సీఎం జగన్ వాల్మీకి/బోయలకు ఖుషీ కబురు చెప్పారు. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాన్ని పరిశీలించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఆనంద్‌తో ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. మూడు నెలల్లోగా దీనిపై నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం జగన్ నిర్ణయంతో దశాబ్దాల తమ కల సాకారమయ్యే సమయం ఆసన్నమైందని వాల్మీకి బోయలు భావిస్తున్నారు.
వాల్మీకి/బోయ ఒరియా బెంతు కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ కొన్ని దశాబ్ధాలుగా ఉంది. ఇటీవల సీఎం జగన్ కర్నూలు పర్యటన సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని సీఎం జగన్ అప్పటికప్పుడు అధికారులను ఆదేశించారు. అధికారులు సమర్పించిన వివరాలను పరిశీలించిన సీఎం జగన్.. తాజాగా కమిషన్ ఏర్పాటుకై ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వాల్మీకి, బోయ, ఒరియా బెంతు కులాల జనాభా 40 లక్షలు ఉంటుందని అంచనా. కమిషన్ ఏర్పాటుతో ఆ కమ్యూనిటీ ప్రజల్లో ఆశలు చిగురించాయి.
పలు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ హోదా :
ఏపీలో వాల్మీకి/బోయ కులాలు ప్రస్తుతం బీసీ జాబితాలో ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఎస్టీ జాబితాలో, ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీ జాబితాలో ఉన్నారు. ఏపీలోనూ వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని గతంలో చాలా కమిషన్లు నివేదికలు ఇచ్చినప్పటికీ అది ఆచరణ రూపం దాల్చలేదు. ఎస్టీ హోదా రావాలంటే సదరు కులాలు అటవీ, కొండ ప్రాంతాల్లో నివసించేవిగా పరిగణిస్తారు. కానీ ఏపీలో వాల్మీకి, బోయలు పల్లపు ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఎస్టీ హోదా దక్కకపోవడానికి ఇదొక ప్రధాన కారణంగా కనిపిస్తోంది.