
CM Jagan appoints committee to solve aqua farmers issues
ఆక్వా రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆక్వా రైతుల ఫిర్యాదులను పరిశీలించిన సీఎం.. వాటి పరిష్కారం కోసం ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అధికారులు పూనం మాలకొండయ్య, విజయానంద్, కన్నబాబు ఉన్నారు. వ్యాపారులు తమ పట్ల అనుసరిస్తున్న వైఖరిపై ఆక్వా రైతులు సీఎంకు ఇచ్చిన ఫిర్యాదులో తమ గోడు వెల్లబోసుకున్నారు. దీనిపై సీరియస్ అయిన సీఎం.. ఆక్వా రైతులకు నష్టం కలిగించే చర్యలను చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కొంతమంది వ్యాపారులు సిండికేట్గా మారి ఆక్వా ఉత్పత్తుల ధరలు తగ్గించేస్తున్నారని.. అదే సమయంలో ఆక్వా ఫీడ్ ధరలు పెంచుతున్నారని.. ఈ చర్యలతో తమకు చాలా నష్టం జరుగుతోందని ఆక్వా రైతులు సీఎంకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రైతులకు అండగా నిలిచేలా ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా.. వ్యాపారస్తులు సిండికేట్గా ఏర్పడి వారికి నష్టం కలిగేలా చేయడమేంటని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ఆక్వా రైతుల ఫిర్యాదులపై వారం రోజుల్లో నివేదిక అందించాలని కమిటీని ఆదేశించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఆక్వా రైతులకు నష్టం కలిగిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతులకు లబ్ది చేకూర్చేలా సీఎం జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. చేపలు, రొయ్యల చెరువుల విద్యుత్ సర్వీసులకు రూ.3.85 ఉన్న క్రాస్ సబ్సిడీని రూ.2.35కు తగ్గించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 60,472 సర్వీసులకు సబ్సిడీపై యూనిట్ విద్యుత్ కేవలం రూ.1.50కే అందిస్తున్నారు. ఈ నిర్ణయాలతో ఏపీ ప్రభుత్వంపై ఏటా రూ.720 కోట్ల భారం పడుతోంది. ఆక్వా రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ భారాన్ని భరిస్తోంది. ప్రభుత్వం ఇంత చేసినప్పటికీ… ఆక్వా వ్యాపారులు ఆక్వా రైతుల కష్టాన్ని దోచుకునేలా వ్యవహరిస్తుండటం పట్ల సీఎం జగన్ సీరియస్ అవుతున్నారు. ఆక్వా రైతులపై సాగుతున్న ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక కమిటీని తాజాగా నియమించడంతో రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.