
డిజిటల్ విద్యలో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 4,72,472 మంది విద్యార్థులకు పంపిణీ చేయాలన్నప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.606.18 కోట్లు కేటాయించనుంది ప్రభుత్వం. 50,194 మంది ఉపాధ్యాయులకు కూడా రూ.64.46 కోట్లతో ట్యాబ్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. నవంబర్లో వీటిని పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2025లో పదో తరగతి పరీక్షలను సీబీఎస్ఈ విధానంలో రాయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరికొన్నినిర్ణయాలను తీసుకుంది.
విద్యా వ్యవస్థల్లో నాణ్యతను మెరుగు పరచడం కోసం విశ్వవిద్యాలయాలకు సంబంధించి పలు చట్టాల సవరణకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రతిపాదన బిల్లుకు, ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియమాకంలో నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర సచివాలయంలో సాధారణ పరిపాలన విభాగంలో వివిధ కేడర్లలో 85 అదనపు పోస్టుల మంజూరు చేయనుంది.
అలాగే గ్రేటర్ విశాఖ పరిధిలో 96,250 ఇళ్లు, అనకాపల్లిలో 3,750 ఇళ్ల నిర్మాణానికి పరిపాలన పరమైన అనుమతుల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ ఇళ్ల కేటాయింపుల ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షలు లబ్ధి చేకూరనుంది. ఇదిలా ఉంటే.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసేందుకు నిర్ణయించింది.