
chintakayala ayyanna patrudu
‘బాప్ దస్ నంబర్ కా .. బేటా బీస్ నెంబర్ కా’.. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయన్న పాత్రుడు, ఆయన కుమారుడు రాజేశ్ అరెస్టుల నేపథ్యంలో వైసీపీ నాయకులు డైలాగ్ ఇది. ఇంతకీ అయన్నతో పాటు ఆయన కుమారుడిని సీఐడీ పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? వారు ఎదుర్కొంటున్న అభియోగాలు ఏంటి? మీడియా సమావేశంలో సీఐడీ డీఐజీ ఏం చెప్పారు?
ఫోర్జరీ సంతకాలతో 2 సెంట్ల భూమిని ఆక్రమించారనే అభియోగాలతో సీఐడీ పోలీసులు గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు అయ్యన్నను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అయ్యన్నపై ఐపీసీ 464, 467, 471, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడిని కోర్టు ముందు హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అసలు అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేశ్ ను ఎందుకు అరెస్ట్ చేశామన్న విషయాన్ని వివరించేందుకు గురువారం మధ్యాహ్నం సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అయ్యన్నపై వచ్చిన ఫిర్యాదు, అందులో ఆయనపై నమోదైన ఆరోపణల గురించి సునీల్ నాయక్ వివరించారు. సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ మాటల్లో..
ఫోర్జరీ చేసి ఎన్ఓసీ..
తమది కాని 2 సెంట్ల భూమిని అయ్యన్నపాత్రుడు… తన ఇద్దరు కుమారులు చింతకాయల విజయ్, చింతకాయల రాజేశ్ లతో కలిసి ఆక్రమించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎన్ఓసీని సృష్టించారు. ఎన్ఓసీపై ఏఈ సంతకంతో పాటు సదరు ఇంజినీర్ పనిచేస్తున్న కార్యాలయ సీల్ మూడా నకిలీదే. అంతటితో ఆగకుండా ఈ వ్యవహారాన్ని ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్థాయి అధికారి చేత అటెస్టేషన్ కూడా అయ్యన్న చేయించారు. ఇందుకోసం సదరు ఏఈని అయ్యన్న తన ఇంటికి పిలిపించి బలవంతంగా అటెస్టేషన్ చేయించారు.
10 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం..
ఈ వ్యవహారంపై మాకు ఫిర్యాదు అందగా… ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పలుకుబడి కలిగిన రాజకీయ నేత కావడంతో అరెస్ట్ లేమీ చేయకుండానే ఓ ఇన్ స్పెక్టర్ స్థాయి అధికారితో దాదాపుగా నెల రోజుల పాటు విచారణ చేయించాం. ఈ విచారణలో అయ్యన్న, ఆయన కుమారులపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలింది. ప్రస్తుతం వీరు ఆక్రమించిన 2 సెంట్ల స్థలం చింతకాయల విజయ్ పేరిట ఉంది. విచారణ చేపట్టిన ఇన్ స్పెక్టర్ తమకు ఓ నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో పేర్కొన్న అంశాల ఆధారంగా అయ్యన్న, ఆయన కుమారులపై ఐపీసీ 464, 467. 471. 474, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఈ సెక్షన్ల ఆధారంగా నిందితులకు 10 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉంది.
ఫోర్జరీలు చేసేవాడు సామాజిక కార్యకర్త అవుతాడా..?
- అయన్న పాత్రుడు, ఆయన కుమారుడు రాజేశ్ అరెస్టును టీడీపీ ఖండించింది. పార్టీ అధినేత చంద్రబాబు, సీనియర్ నేత నారా లోకేశ్ అరెస్టును తప్పు పట్టారు. జగన్ ప్రభుత్వం.. అయ్యన్నపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం.. టీడీపీకి పలు పశ్నలను సంధించించింది.
- ఇరిగేషన్ శాఖకు చెందిన పంట కాలువ స్థలాన్ని ఆక్రమించుకుని, దానికి సంబధించిన ఒక ఫోర్జరీ సర్టిఫికేట్ సృష్టించి, తప్పుడు పత్రాలను ఏకంగా హైకోర్టుకు సమర్పించిన వ్యక్తిని ఆధారాలతో సహా అరెస్టు చేస్తే.. ఆ అరెస్టును సమర్థించే వారిని ఏమనాలి..? అరెస్టు సమయంలో అయ్యన్నపాత్రుడి వీడియోలు చూస్తే.. ఒక మాఫియా డాన్ ఎప్పుడూ గూండాలను చుట్టుపెట్టుకుని, ఒక డెన్ లో ఎలా ఉంటాడో అలాగే ఉన్నారు. పోలీసులను మీ అంతు చూస్తాను అని బెదిరించినవాడిని చట్టానికి కట్టుబడ్డ వ్యక్తి అంటారా? లేక.. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారా..?
- అయ్యన్న చేసిన నేరానికి, బీసీలకు ఏం సంబంధం..?
- అయ్యన్నకు మద్దతు తెలిపి.. ఈ నేరంలో తమకూ సంబంధం ఉందని టీడీపీ చెబుతోందా?
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరుగుతున్నది జగన్ ప్రభుత్వంలో మాత్రమే అన్న నిజం బీసీలు గమనించారు. మిగతా సామాజిక వర్గాలు కూడా గమనించాయి. మీకు ఇంకా తెలియడం లేదా?
- ఇంగ్లీషు మీడియం వద్దన్నవారు, ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి వీల్లేదని కోర్టుల్లో కేసులు వేసి అడ్డుపడిన వారు, బీసీల పక్షపాత వ్యక్తులు అవుతారా..?
- బీసీల తోకలు కత్తిరిస్తానన్నవారు బీసీ అనుకూలురు అవుతారా..?
- డెమోగ్రాఫిక్ ఇన్ బ్యాలెన్స్ అని మాట్లాడినవారు బీసీలను సమర్థించినట్టా…?
- గంజాయి వ్యాపారి.. చట్టబద్ధ వ్యాపారస్థుడు అవుతాడా..?
- ఫోర్జరీలు చేసేవాడు సామాజిక కార్యకర్త అవుతాడా..?
- దొంగ సంతకాలు పెట్టి డాక్యుమెంట్లు తారుమారు చేసిన వ్యక్తి.. దేశ భక్తుడా? లేక తెలుగుదేశం భక్తుడా..?
- ఒకప్పుడు సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన వారికి ఇలాంటి దొంగ పనులు చేయవచ్చు అని లైసెన్స్ ఇచ్చారా..?
- టీడీపీ వారికి భారత, ఏపీ చట్టాలు వర్తించవా..?
- టీడీపీ వారికి ఈ దేశంలో న్యాయం, రాజ్యాంగం వర్తించవా..?
- ధూళిపాళ్ళ నరేంద్ర, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కోడెల శివప్రసాదరావు, యరపతినేని శ్రీనివాస్, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా.. వీరంతా సంఘ సేవకులా.. లేక.. రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీదారులా..? వీరిని అరెస్టు చేస్తే చట్టాన్ని ఉల్లంఘించినట్టా..?. ఇంత దుర్మార్గమా..? పైగా దీన్ని సమర్థించడానికి ఎల్లో మీడియానా..?
- ఇవన్నీ చూస్తే టీడీపీ అంటే.. తెలుగుదేశం పార్టీనా..? లేక తెలుగు దొంగల పార్టీనా..?
ఇలాంటి ప్రశ్నలను వైసీపీ ప్రభుత్వం సంధించింది. అయితే ఈ ప్రశ్నలకు టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.