
chandrababu
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడంపై టీడీపీ ఆందోళన బాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఎన్టీఆర్ పేరును తీసేసి.. వైఎస్సార్ పేరును పెట్టడం జగన్ ప్రభుత్వానికి తగదని, తాము అధికారంలోకి వచ్చాక.. పేరును తిరిగి మారుస్తామని చంద్రబాబు ప్రకటించారు.
ఈ క్రమంలో విశ్వవిద్యాలయం పేరు మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని కోరుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నాయకులు బిస్వభూషన్ హరి చందన్ కు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చె న్నాయుడు, ఎంపీలు కేశినేని శ్రీనివాస్(నాని), కనకమేడల రవీంద్ర, టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకుల బృందం పరిస్థితిని గవర్నర్ కు వివరించింది.
అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను గవర్నర్ దృష్టికి తెచ్చామన్నారు. 1986లో హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ స్థాపించారని చంద్రబాబు చెప్పారు. తాను సీఎంగా ఉన్నప్పుడు జిల్లాకో మెడికల్ కాలేజీ తీసుకువచ్చామన్నారు. టీడీపీ హయాంలో 18 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. సీఎం జగన్రెడ్డి దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాట్లాడేవన్నీ పచ్చి అబద్ధాలేనన్నారు. హెల్త్ వర్సిటీ పేరు మారుస్తూ చీకటి జీవో తెచ్చారని, హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించేంతవరకూ పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.