
chandrababu naidu
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విశాఖపై మరోసారి విషం చిమ్మారు. మూడు రాజధానులపై తన అక్కసును వెళ్లగక్కారు. అమరావతి రైతులపై తనకున్న ప్రేమను.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలపై తనకు ఉన్న ద్వేషాన్ని బయట పెట్టుకున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ లీగల్ సెల్ నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సవం దీనికి వేదికైంది. ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే?
‘3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. మేము ధర్మం, న్యాయం కోసం పోరాడుతున్నాం’ అని చంద్రబాబు అన్నారు. తాము న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడుతున్నామని చంద్రబాబు సెలవిచ్చారు. అయితే ఇక్కడ ధర్మం ఏది ? అధర్మం ఏది ? చంద్రబాబు అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని ఆశపడుతున్నారు. ఈ క్రమంలో అమరావతి రైతుల పేరుతో చేస్తున్న ఉద్యమం ధర్మమైనదని చంద్రబాబు ఉద్దేశం. మరి అదే చంద్రబాబు ఉద్దేశం అయితే.. విశాఖ రాజధాని కోసం ఉత్తరాంధ్ర ప్రజలు చేస్తున్నది అధర్మమా? కర్నూలును న్యాయ రాజధాని చేయాలని అక్కడి ప్రజలు చేస్తున్న ఉద్యమం అధర్మమని చంద్రబాబు అనుకుంటున్నారా?
తనను తాను జాతీయ నేతగా అభివర్ణించుకునే చంద్రబాబు.. కేవలం ఒక ప్రాంతం కోసం.. అందులోనూ ఒక వర్గం ఆలోచించడం ఎంతవరకు సమంజసమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశాఖ రాజధాని అనేది ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష. విశాఖ రాజధాని అయితే తమ జీవితాలు బాగుపడుతాయని ఉద్యమం చేస్తున్న ఉత్తరాంధ్ర ప్రజలది.. అది అధర్మం ఎలా అవుతుంది? రియల్ ఎస్టేట్ రాజధాని కోసం పాదయాత్ర చేస్తున్న వారి ఉద్యమం ధర్మమని చంద్రబాబు చెప్పడం.. దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఒకవైపు సేవ్ ఉత్తరాంధ్ర అంటూనే.. ఆ ప్రాంత ప్రజలు చేస్తున్న ఉద్యమం అధర్మమని చెప్పడం.. ద్వంద్వ నీతి కాకపోతే మరేమిటని ప్రశ్నిస్తున్నారు.
మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నట్లు మరో వాదనను తెరపైకి తెచ్చారు చంద్రబాబు. మూడు రాజధానులను వ్యతిరేకించేది ఎవరు? ఎవరి మధ్య ఎవరు చిచ్చు పెడుతున్నారు? రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. విశాఖ, కర్నూలులో రాజధాని వద్దని అమరావతి రైతులను ఎగదోస్తుంది చంద్రబాబు కాదా? అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలని.. మిగతా ప్రాంతాలకు అన్యాయం చేయాలని చూస్తున్నది చంద్రబాబు కాదా? అమరావతిలో భూ కుంభకోణానికి తెరలేపి.. తన అనుయాయులకు రూ. కోట్లు విలువ చేసే భూములను కట్టబెట్టింది చంద్రబాబు కాదా? ఇప్పుడు వారి ప్రయోజనాలను కాపాడేందుకు ఇతర ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నది జామాతా దశమగ్రహమంటూ సీనియర్ ఎన్టీఆర్ ప్రస్తావించిన చంద్రబాబు కాదా?
చంద్రబాబు మొదటి నుంచి విశాఖ, కర్నూలు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అమరావతి రైతుల పేరుతో కృత్రిమ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను అవమానించేలా బహిరంగంగానే మాట్లాడారు. విశాఖను రాజధాని చేయాలంటూ ఆ ప్రాంత ప్రజలు విశాఖ గర్జనకు సిద్ధమవుతున్న వేళ.. అక్కడి ప్రజలు చేస్తున్నది అధర్మమని చెప్పడం.. వారిని అవమానించినట్లు కాకపోతే మరేంటి?