
chandrababu naidu recalls his friendship with ys rajasekhar reddy in nandamuri balakrishna unstoppable show
ఎప్పుడూ సీరియస్ పాలిటిక్స్‌లో తలమునకలై ఉండే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహుశా తొలిసారి చాలా సరదా సరదాగా ఒక టాక్ షాలో పాల్గొన్నారు. ఎప్పుడూ ఉండే గంభీరమైన టోన్‌ని, సీరియస్‌నెస్‌ని కాస్త పక్కనపెట్టి తనలోని మరో యాంగిల్‌ని చూపించారు. ఇంతకీ ఆ షో ఏంటంటే… ‘ఎన్బీకే అన్‌స్టాపబుల్’. బావమరిది బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ షోలో గెస్ట్‌గా పాల్గొన్న చంద్రబాబు.. బాలయ్య అడిగిన ప్రతీ ప్రశ్నకు చాలా ఉత్సాహంగా, హుషారుగా సమాధానాలు చెప్పారు. కొన్నిచోట్ల ఉత్కంఠ రేకెత్తించే సమాధానాలిచ్చారు. తాజాగా రిలీజైన ఈ టాక్ షో ప్రోమో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఇందులో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో స్నేహం గురించి చంద్రబాబు ప్రస్తావించడం ప్రోమోకే హైలైట్‌గా నిలిచింది.
రాజకీయంగా బద్ద శత్రువులైనప్పటికీ తమ మధ్య చెరగని స్నేహం ఉందన్నట్లుగా చంద్రబాబు అన్‌స్టాబుల్ షోలో పేర్కొన్నారు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరని బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు.. రాజశేఖర్ రెడ్డి, తాను కలిసి చాలా తిరిగామని చెప్పారు. మీ ఇద్దరు కలిసి చేసిన ఒక్క అల్లరి పనేదైనా చెప్పండని బాలకృష్ణ చంద్రబాబును అడగ్గా.. నవ్వుతూ ఆయనేదో చెప్పబోయారు. అదేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌లో పెట్టేశారు. దీంతో వైఎస్‌తో స్నేహంపై చంద్రబాబు ఏం చెప్పి ఉంటాడానేది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇదే షోలో చంద్రబాబు వ్యక్తిగత విషయాలు కూడా కూపీ లాగే ప్రయత్నం చేశారు బాలయ్య. మీ లైఫ్‌లో మీరు చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏదని అడిగిన ప్రశ్నకు.. మీకన్నా ఎక్కువే చేశానంటూ నవ్వేశారు చంద్రబాబు. మీరు సినిమాల్లో చేస్తే నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు చేశానని.. అమ్మాయిలు కనబడితే బైక్ సైలెన్సర్ తీసేసి డ్రైవ్ చేసేవాడినని చెప్పుకొచ్చారు. ఈ ఎపిసోడ్లో సీరియస్ పాలిటిక్స్ కూడా చర్చకొచ్చాయి. మీ జీవితంలో బిగ్ డెసిషన్ ఏంటని అడిగిన ప్రశ్నకు.. 1995 నిర్ణయమని చెప్పారు. అప్పటి ఎపిసోడ్ కారణంగానే చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారనే ప్రచారం ఉంది. ఈ టాక్ షోలో చంద్రబాబు దానిపై ఏం చెప్పి ఉంటాడా అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ షోలో నారా లోకేష్ కూడా కనిపించడం విశేషం. లోకేష్ మంగళగిరిలో ఓడిపోయిన అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. కొద్దిసేపు లోకేష్ హోస్ట్‌గా బాలకృష్ణను, చంద్రబాబును సరదా ప్రశ్నలు అడిగి అలరించారు.
అంతా బాగానే ఉన్నప్పటికీ ఒక సందర్భంలో ‘రాళ్లు రప్పలున్న చోట వేల కోట్ల టర్నోవర్ చేసే సైబరాబాద్‌ను నిర్మించిన గొప్ప విజనరీ మీది’ అంటూ బాలకృష్ణ పేర్కొనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, అప్పట్లో బాహుబలి రాలేదు కాబట్టి దాన్ని గ్రాఫిక్స్ అని విమర్శించలేదని బాలకృష్ణ పేర్కొన్నారు. ఏపీలో అమరావతి రైతుల పాదయాత్ర.. దాన్ని వ్యతిరేకిస్తూ వికేంద్రీకరణ ఉద్యమం జరుగుతున్న వేళ.. బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేయడం యాధృచ్చికమేమీ కాదనే వాదన వినిపిస్తోంది.