
chandrababu naidu
కుప్పంలో జగన్ పర్యటన విజయవంతమైన తర్వాత.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనలో పడ్డారా? 2024 ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేయడం లేదా? ఆయన మరోస్థానం నుంచి పోటీ చేస్తున్నారా? లేకపోతే రెండు స్థానాల్లో నిలబడపోతున్నారా?
2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి తొలి అడుగు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న.. కుప్పమే కావాలని వైసీపీ భావిస్తోంది. కుప్పం నుంచి గెలుపు పరంపర కొనసాగించాలని వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా ఇటీవల సీఎం జగన్.. కుప్పం పర్యటన కూడా చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వచ్చిన ఫలితాలు.. జగన్ పర్యటన నేపథ్యంలో వచ్చిన స్పందనను చూసి.. ఈ సారి కుప్పంలో వైసీపీ గెలుపు నల్లేరుపై నడకగా మారే అవకాశం ఉంది. వైసీపీ దూకుడుతో చంద్రబాబు అయోమయంలో పడినట్లు కనిపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో కుప్పంలో 1989 నుంచి వరుసగా ఏడుసార్లు ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు.. అక్కడి ప్రజల్లో మార్పు వచ్చినట్లు గమనించి ఉంటారనే అభిప్రయం వ్యక్తమవుతోంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కే చంద్రమౌళిని ఓడించిన చంద్రబాబుకు.. ఇప్పడు కుప్పంలో వ్యతిరేక వవనాలు వీస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో ఇన్నేళ్లుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పంలో బీటలు వారాయి. 2024 ఎన్నికల్లో మొత్తానికి మొత్తం గెలుచుకోవడానికి వ్యూహాత్మకంగా భరత్ ను రంగంలోకి దింపింది వైసీపీ. ఇన్నాళ్లు బీసీల మద్దతుతో గెలిచిన చంద్రబాబుకు వ్యతిరేకంగా బీసీని ప్రత్యర్థిగా ప్రకటించారు సీఎం జగన్. ఇది చంద్రబాబుకు కాస్త ఆందోళన కలిగించే విషయమే.
ఇటీవల కుప్పంలో జరిగిన వైసీపీ బహిరంగ సభ విజయవంతం కావడంతో టీడీపీ క్యాడర్ను నైరాశ్యం కమ్మేసింది. చంద్రమౌళి తనయుడైన ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అతనికి తోడుగా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉండటంతో చంద్రబాబు.. కుప్పం కాకుండా మరోస్థానం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పోటీ చేసి ఓడిపోతే కుప్పం సీటును కోల్పోవాల్సి వస్తుందని.. తన రాజకీయ జీవితంపై మరో మాయని మచ్చ పడుతుందని టీడీపీ అధినేత ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. దాంతో పరాజయం కంటే బలమైన స్థానం నుంచి పోటీ చేసి పరువు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారట.
గతంలో పార్టీ అధ్యక్షులు ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్ రెండు సార్లు, మెగాస్టార్ చిరంజీవి ఒకసారి, పవన్ కల్యాణ్ ఒకసారి పోటీ చేశారు. ఇదే తరహాలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా రెండు స్థానాల నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేరే చోటికి పోకుండా తనకు అనుకూలంగా ఉన్న రాయలసీమలోని నియోజకవర్గం కోసం వెదుకులాట మొదలుపెట్టారట. అలా కుప్పం పోయినా.. మరో నియోజకవర్గంతో పరువు నిలబెట్టుకునే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.