
cm jagan
- మారుమూల ప్రాంతాలకు ప్రభుత్వ ఫలాలు చేరవేసేందుకే వికేంద్రికరణ
- అసెంబ్లీలో సీఎం జగన్
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని చంద్రబాబు చూస్తున్నారని, అంత నీచమైన స్థాయికి ఏ నాయకుడూ పోడు అన్నారు సీఎం జగన్. అసెంబ్లీలో అధికార వికేంద్రికరణపై జరిగిన చర్చలో సీఎం జగన్ కీలక ప్రసంగం చేశారు. వికేంద్రికరణ ఆవశ్యతను వివరించారు. వికేంద్రీకరణ అనేది ఒక అవసరమని, పరిపాలన అనేది మారుమూల గ్రామాలకు సైతం ఎఫెక్టివ్‌గా అందాలంటే వికేంద్రీకరణ జరిగి తీరాలన్నారు.
అమరావతికి తాము వ్యతిరేకంగా కాదని, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలనే తమ ఆకాంక్ష అన్నారు. విజయవాడ బాగు పడాలని చెప్పి రూ.100 కోట్లు తాము ఇచ్చామన్నారు. విజయవాడ నదికి ఆనుకుని ఉన్న ప్రజలు ఎప్పుడు వర్షాలు వచ్చినా ఇబ్బంది పడేవారన్నారు. మూడు, నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి మొత్తం కృష్ణలంక ప్రాంతం మునిగిపోయేదన్నారు సీఎం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదన్నారు. అక్కడ రీటెయినింగ్ వాల్ కట్టడం కోసం రూ.137 కోట్లతో దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల వాల్ పూర్తి చేశామన్నారు.
“చంద్రబాబు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కరకట్ట రోడ్డును పూర్తిగా విస్మరించారు. ఈ పెద్దమనిషి 5 ఏళ్లలో ఆ రోడ్డును వెడల్పు చేయలేదు. కనీసం ఆ పనులు కూడా మొదలు పెట్టలేదు. రూ.150 కోట్లు ఇచ్చి మనం ఆ పనులు మొదలు పెట్టాం. విజయవాడ బందరు రోడ్లో అంబేడ్కర్ పార్క్‌ను రూ.260 కోట్ల వ్యయంతో విజయవాడ ప్రజలు ఆహ్లాదంగా గడిపేందుకు, సాయంత్రం వాకింగ్ చేయడం కోసం పార్క్ నిర్మిస్తున్నాం. ఏప్రిల్ నాటికి పనులు పూర్తవుతాయి.
ఇదే విజయవాడలో కనకదుర్గమ్మ గుడి. ఆ తల్లి చల్లని దీవెనలతోనే మనం క్షేమంగా ఉన్నాం. కానీ ఏ రోజైనా కానీ ఆ గుడిని అభివృద్ది చేయాలని ఆ పెద్దమనిషి ఆలోచన చేయలేదు. అదే మన ప్రభుత్వం ఆ గుడి కోసం రూ.70 కోట్లు ఇచ్చింది. అదే చంద్రబాబు తన హయాంలో 40 గుడులు కూల్చేశాడు.” – అసెంబ్లీలో సీఎం జగన్
ఏదైనా పని చేయాలన్న తపన ఉంటే.. ఆ పనులు జరుగుతాయన్నారు సీఎం జగన్. డ్రామాలు చేస్తే చివరకు గ్రాఫిక్స్ మాత్రమే మిగులుతాయన్నారు. గతంలో తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఇప్పుడు అధికారంలో ఉంటున్న మూడేళ్ల ఉంచి ప్రతిసారి వికేంద్రీకరణ గురించే మాట్లాడినట్లు చెప్పారు. ఇంకా చెప్పాలంటే శ్రీబాగ్ ఒప్పందం మొదలు శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీ, బోస్టన్ గ్రూప్, ఎక్స్పర్ట్స్ గ్రూప్ వరకు అందరి అభిప్రాయం ఇదేనన్నారు.
“చంద్రబాబు అనుసరిస్తున్న తీరును చూస్తే.. ఒక సామెత గుర్తుకు వస్తుంది. ‘తిమిరి ఇసుము నుంచి తైలమ్ము తీయవచ్చు. మృగతృష్ణలో నీరు త్రావవచ్చు. కుందేటి కొమ్ము సాధించవచ్చు. మూర్ఖుని మనసు రంజింప శక్యమేనా’.. ఇది అన్నది భర్తృహరి. ఆయన సుభాషితం. దీని అర్ధం. ఇసుక నుంచి నూనె తీయొచ్చు. ఎండమావిలో నీరు తాగొచ్చు. కుందేటి కొమ్ము సాధించవచ్చు కానీ.. చంద్రబాబు వంటి వాణ్ని, ఈ దుష్ట చతుష్టయాన్ని ఈ మూర్ఖత్వం నుంచి ఒప్పించడం మాత్రం ఎవరి వల్లా కాదు” – అసెంబ్లీలో సీఎం జగన్