
cm jagan
కుప్పం నుంచి తనకు కావాల్సినంత రాబట్టుకున్న చంద్రబాబు.. ఇక్కడి ప్రజలకు మాత్రం ఏమీ చేయలేదన్నారు సీఎం వైఎస్ జగన్. దొంగ ఓట్లు వేయించుకోవడంలో బాబుకు ఉన్న అనుభవం గురించి ఈ జిల్లాలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారన్నారు. 30 ఏళ్లుగా వెన్నుపోటుకు, దొంగ ఓటుకు కేరాఫ్ అడ్రస్ గా చంద్రబాబు నిలిచారన్నారు. వైఎస్సార్ చేయూత మూడో విడత పంపిణీ సందర్భంగా కుప్పం అనిమిగానిపల్లి బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు.
నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో 33 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు ఉన్నారన్నారు. కుప్పంను చంద్రబాబు ఏనాడూ సొంత గడ్డగా భావించలేదని, హైదరాబాదే ముద్దు అని భావించారన్నారు. కుప్పంలో చంద్రబాబుకు సొంత ఇల్లు కాదు కాదు కదా.. ఓటు కూడా లేదన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌కి లోకల్.. కుప్పానికి నాన్‌లోకల్ అని ఎద్దేవా చేశారు. కుప్పంపై ఆయనకు ఉన్నది వెన్నుపోటు ప్రేమ అన్నారు.
చంద్రబాబు పాలనలో దోచుకో పంచుకో తినుకో ద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు.. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు బాగుపడ్డారన్నారు. కానీ, ఇప్పుడు తమ ప్రభుత్వంలో సంక్షేమం సాధ్యమైందని, ప్రజలు అది గుర్తించాలని సీఎం జగన్ మనవి చేసుకున్నారు. చంద్రబాబుది చేతగాని తనం అనాలా? చేయకూడదనే దుర్భుద్ది అనాలా? అర్థం కావట్లేదన్నారు ఆయన.
ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు.. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గంలో కరువు సమస్యకు పరిష్కారం చూపించలేకపోయాడని అన్నారు. పైగా హంద్రీనీవాకు ఆటంకంగా కూడా మారారన్నారు. తనకు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చాడని, కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డాడని, కుప్పంకు మంచి నీళ్లు మాత్రం తెప్పించలేకపోయాడన్నారు.
తన పాలనలో కుప్పానికి ఏనాడు ఏ పని చేయని చంద్రబాబు.. చివరికి ఇక్కడ రెవెన్యూ డివిజన్ కోసం తనకు అడగాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. తాను వెంటనే మంజురూ చేసినట్లు చెప్పుకొచ్చారు జగన్. ‘జగన్ మీవాడు.. మంచోడు.. మీ బిడ్డ.. మీరు అడిగారు.. జగన్ ఇచ్చాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా’ అని జగన్ పేర్కొన్నారు.
ఎమ్మెల్సీగా ఉంటూనే భరత్ నియోజకవర్గానికి ఎన్నో పనులు చేశారన్నారు జగన్.చ భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తానన్నారు.