
cm jagan
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సోమవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడారు. గత ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోలేదని సీఎం జగన్ మండిపడ్డారు. ‘చంద్రబాబు నాయుడు, కరువు విడదీయరాని కవలలు. 2019 నుంచి ఒక్క మండలాన్ని కూడా కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించలేదు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది. పచ్చదనంతో పాటు మా పాలనలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే, టీడీపీ హయాంలో ఐదేళ్ల కాలంలోనే 1,623 మండలాలు కరువును ఎదుర్కొన్నాయి’ అని జగన్ వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు నాయుడు రైతులకు వడ్డీలేని రుణాల పేరుతో మోసం చేశారు. కేవలం రూ.685 కోట్లు మాత్రమే అందుకోసం ఖర్చు చేశారు. అయితే మా ప్రభుత్వం రైతుల కోసం సున్నా వడ్డీకి ఇప్పటికే రూ.1,282 కోట్లు ఖర్చు చేసింది’ అని తెలిపారు.
‘ఆంధ్రప్రదేశ్‌లాగా రైతు పక్షపాత రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదని గర్వంగా చెప్పగలను.. రైతులకు నేరుగా ఏటా రూ.13,500 ఆర్థిక సహాయం అందజేస్తున్నాం. అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండేందుకు మా ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోంది’ అని అన్నారు.
ఇక గత టీడీపీ పాలనపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల వ్యవధిలో 154 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి మాత్రమే నమోదైంది. కానీ, నేడు 167.24 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి రావడంతో పరిస్థితి మారింది. కేవలం మూడేళ్లలోనే ఇదంతా ఉత్పత్తి జరిగింది. రాష్ట్రంలోని ప్రతి రైతు సంతోషంగా ఉన్నాడని ఇది నిరూపిస్తోంది. 44.28 లక్షల మంది రైతులకు ఇప్పుడు రూ.66 వేల కోట్ల విలువైన పంట బీమా అందిస్తున్నాం. కానీ గత ప్రభుత్వం 30.25 లక్షల మంది రైతులకు మాత్రమే రూ. 3,411 కోట్ల పంట బీమా అందించి మిగతావారిని మోసం చేసింది’ అని దుయ్యబట్టారు.
మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరైన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే నాని ఆళ్లగడ్డ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని సీఎంను కోరారు. దీనిపై సీఎం వెంటనే స్పందించి అభివృద్ధి పనులకు రూ. 95 కోట్లు మంజూరు చేశారు. రోడ్లు, డ్రైనేజీ, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, వీధి దీపాలు ఏర్పాటు చేసేందుకు రూ.56 కోట్లు మంజూరు చేశారు. అలాగే సిరివెళ్ల నుంచి రుద్రవరం వరకు హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.8 కోట్లు ఇస్తున్నట్లు సీఎం తెలిపారు.