
సూటి విమర్శలు చేసిన మంత్రి అంబటి రాంబాబు
ఎన్ని సర్వేలు వచ్చినా, ఏ నివేదికలు ఇచ్చినా బాబుకు మిగిలేది రిటైర్మెంటేనని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లోని 25 పార్లమెంట్ స్థానాల్లో 18 నుంచి 23 సీట్లు వైయస్సార్ సీపీకి వస్తాయని సర్వేలు చెప్పాయన్నారు. కానీ 25 పార్లమెంటు సీట్లను కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశాలున్నాయన్నారు. గత ఎన్నికలకు ముందు నూటికి 150 పాళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని గప్పాలు పలికారని ఎద్దేవా చేశారు. ఓడిపోతారని తెలిసి కూడా చంద్రబాబు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారన్నారు. చంద్రబాబు వయసు 75 ఏళ్ళని, వచ్చే ఎన్నికల్లో ఈ సర్వేలు చెప్పినట్లు వైయస్సార్సీపీ విజయం సాధిస్తే బాబుకు రిటైర్మెంట్ తప్ప మరో మార్గమే లేదన్నారు. బాబు 44 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పుడు అంబేద్కరిజం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు గుర్తుకు రాలేదని విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీల గురించి మాట్లాడిన బాబు ఇవాళ కులాల గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. అప్పులపై చేస్తున్నారంటూ చంద్రబాబు తెగ మాట్లాడుతున్నాడన్నారు. బాబు పాలనలో చేసిన అప్పులు ఆయన చుట్టూ ఉన్న అవినీతిపరులు తినేశారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుతో రాష్ట్రంలోని కోటి 50 లక్షల కుటుంబాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని వివరించారు. ఏ అంశం గురించి అయినా చర్చిద్దామని శాసనసభకు రమ్మంటే చంద్రబాబు రాడన్నారు. ద్రౌపది ముర్ముకు ఓటు వేయడానికి మాత్రం శాసనసభకు వస్తారని, ఇదేం రాజకీయమని అంబటి ప్రశ్నించారు.