
chagallu people protest against amaravati farmers padayatra and supports ap decentralization
అమరావతి రైతుల పాదయాత్రకు అడుగడుగునా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజలు ఎక్కడికక్కడ ఈ యాత్రను అడ్డుకుంటున్నారు. ప్లకార్డులు, పోస్టర్లు, నల్ల బెలూన్లతో నిరసన తెలుపుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా చాగల్లులోనూ అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ తప్పలేదు. యాత్రను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు.
అమరావతి రైతుల పాదయాత్రను వ్యతిరేకిస్తూ స్థానికులు చేసిన ఆందోళనలో వైసీపీ శ్రేణులు కూడా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రామారావు డప్పు వాయించి నిరసన తెలిపారు. ఒకే రాజధాని వద్దు… మూడు రాజధానులే ముద్దు… అంటూ అంతా నినదించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులే సరైన మార్గమని… ప్రజలంతా అదే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజా ఆకాంక్షకు విరుద్ధంగా అమరావతి రైతులు దుందుడుకుగా ముందుకెళ్లడం సరికాదన్నారు. ఓవైపు ఎక్కడికక్కడ ప్రజలంతా యాత్రను అడ్డుకుంటున్నా.. మూడు రాజధానులకు మద్దతు పెరుగుతున్నా… అమరావతి పాదయాత్ర చేస్తున్నవారికి కనువిప్పు కలగట్లేదా అని ప్రశ్నించారు.
అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రలో కష్టమే..! :
వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖపట్నంలో తలపెట్టిన ‘విశాఖ గర్జన’ విజయవంతమైంది. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయక దాదాపు లక్ష మంది జనం విశాఖ గర్జనకు తరలివచ్చారు. విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలనే తమ ఆకాంక్షను బలంగా చాటారు. దీంతో వికేంద్రీకరణ కేవలం వైసీపీ రాజకీయ స్వార్థమని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పడినట్లయింది. విశాఖ గర్జన విజయవంతమవడం అమరావతి రైతుల పాదయాత్రకు మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి. ఈ స్థాయిలో ఉత్తరాంధ్ర ప్రజలు తమ ఆకాంక్షను చాటిన తర్వాత కూడా.. అమరావతి పాదయాత్ర అక్కడ అడుగుపెట్టడంలో అర్థం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.