
PM Kisan samriddhi kendralu
సంక్షేమ విప్లవంతో దూసుకెళ్తున్న వైసీపీ సర్కార్ పథకాలు దేశానికే దిక్సూచిలా నిలుస్తున్నాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న పలు పథకాలకు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా రైతాంగ సంక్షేమాభివృద్ది కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్బీకే వ్యవస్థ కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఆకర్షించింది. ఆర్బీకేల స్పూర్తితో కేంద్రప్రభుత్వం పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా దేశవ్యాప్తంగా 864 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను (PMKSK) ప్రారంభించారు. రైతు సమస్యల పరిష్కారం, వ్యవసాయ సంబంధిత సేవలను ఈ కేంద్రాల ద్వారా అందించనున్నారు.
పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాల్లో ఆర్బీకే తరహా సేవలు
ప్రస్తుతం ఏపీలోని రైతు భరోసా కేంద్రాలు రైతులకు ‘వన్ స్టాప్ సొల్యూషన్’లా పనిచేస్తున్నాయి. రైతులకు కావాల్సిన విత్తనాలు, పురుగు మందులు, అగ్రికల్చర్ మెషీన్లు అందించడం, భూసార పరీక్షలు నిర్వహించడం, ఆధునిక వ్యవసాయ పద్దతుల పట్ల రైతులకు అవగాహన కల్పించడం, కాల్ సెంటర్ ద్వారా సూచనలు, సలహాలు ఇవ్వడం, ఇ క్రాప్, పంట భీమా, పంటకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు చేపట్టడం వంటి సేవలను ఆర్బీకేల ద్వారా అందిస్తున్నారు.
కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాల ద్వారా దాదాపుగా ఇవే సేవలు అందించనున్నారు. వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ స్కీమ్‌లో భాగంగా భారత్ బ్రాండ్ పేరిట నాణ్యమైన ఎరువులను ఈ కేంద్రాల ద్వారా రైతులకు అందిస్తారు. అలాగే నాణ్యమైన విత్తనాల పంపిణీ, భూసార పరీక్షల నిర్వహణ, ఆధునిక వ్యవసాయ పద్దతుల పట్ల రైతులకు అవగాహన కల్పించడం, డ్రోన్లు, సోలార్ ప్యానెళ్లు అందించడం, హెల్ప్ డెస్క్, వంటి తదితర సేవలు ఈ కేంద్రాల అందించనున్నారు
ఏపీలో 32 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 17న దేశవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింద 864 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను లాంచ్ చేశారు. గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 32 కేంద్రాలు ఏపీలో ఉన్నాయి. గుంటూరులో 3, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి,కృష్ణ, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీకాకుళం, కాకినాడ జిల్లాల్లో రెండేసి చొప్పున పీఎంకెఎస్కేలను ఏర్పాటు చేశారు. నెల్లూరు, వైఎస్సార్ కడప, చిత్తూరు, ఏలూరు, కర్నూలు, అనంతపురం, అల్లూరి, కోనసీమ, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వచ్చే నవంబర్‌లో జిల్లా స్థాయిల్లో దేశవ్యాప్తంగా 37,460, వచ్చే ఏడాది జనవరిలో బ్లాక్ స్థాయిలో 1,82,126 కేంద్రాలు, ఫిబ్రవరిలో 1,16,049 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.