
bjp-jenasena
2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజీపీ- జనసేన దోస్తీ దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. ఏపీ వ్యవహారాల కో-ఇన్చార్జి సునీల్ దేయోధర్ చేసిన వ్యాఖ్యలు.. ఈ పార్టీల పొత్తుపై మరింత స్పష్టత ఇస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకు బీజేపీ, జనసేన కలిసి పోరాడుతాయన్నారు సునీల్ దేయోధర్.
ఏపీ ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు సునీల్ దేయోధర్ . జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీస్తోందన్నారు. కొత్త పరిశ్రమలను జగన్ సర్కారు ఆకర్షించలేక పోతోందన్నారు. పరిపాలనా ఖర్చులకు సరిపడా ఆదాయాన్ని ఏపీ ప్రభుత్వం సమకూర్చుకోలేక పోతోందన్నారు.
వైసీపీ పాలనలో ల్యాండ్మాఫియా, ఇసుక మాఫియా, ఎర్రచందనం మాఫియా, మద్యం మాఫియా, గంజాయి మాఫియా, గ్రానైట్ మాఫియా రాజ్యమేలుతున్నాయన్నారు దేయోధర్. టీడీపీ ప్రభుత్వం కూడా ఇందుకు భిన్నంగా లేదని ఆరోపించారు. బీజేపీ-జేఎస్పీ కలయిక మాత్రమే పట్టాలు తప్పిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టగలదన్నారు సునీల్ దేయోధర్.
జనసేన-బీజేపీ అధికారంలోకి వస్తే.. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. దొనకొండ డిఫెన్స్ కారిడార్, నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్), దోర్నాలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మార్కాపూర్లో మెడికల్ కాలేజీ సహా రాష్ట్రానికి రూ.60,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసినప్పటికీ, ఈ ప్రాజెక్టులు విఫలమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించకపోవడం వల్లే పనులు చేపట్టలేదన్నారు. వైసీపీ హయాంలో మత మార్పిడులు విపరీతంగా జరుగుతున్నాయని సునీల్ దేయోధర్. రాష్ట్ర ప్రభుత్వం మతమార్పిడి నిరోధక చట్టాలను రూపొందించాలని డిమాండ్ చేశారు.