ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా (BJP) భారీ విజయం సాధిస్తున్నదని తాజా ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ విజయంపై కేంద్ర మంత్రి మరియు భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. 27 సంవత్సరాల తరువాత దిల్లీలో భాజపా అధికారంలోకి రాబోతున్నట్లు కిషన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.
“ఢిల్లీ ఓటర్లకు శుభాకాంక్షలు. అద్భుతమైన విజయాన్ని దిల్లీ ప్రజలు ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో భాజపాకు మంచి వాతావరణం ఏర్పడింది. కర్ణాటక, తెలంగాణలో కూడా మా పార్టీ అధికారంలోకి వస్తుందని నేను నమ్ముతున్నాను. కాంగ్రెస్ పార్టీ మాత్రం భరాస తరహాలో ప్రవర్తిస్తూ, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, అన్ని వర్గాలను మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతూ, బీసీలను అవమానిస్తూ అన్యాయం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీసీలలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతుంది” అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.