
ప్రజలకు సకాలంలో వైద్యం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యులు, సిబ్బంది సకాలంలో ఆస్పత్రులకు చేరినప్పుడే ప్రజలకు వైద్యం అందుతుందని భావించిన ప్రభుత్వం.. సర్కారు ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని వైద్య ఆరోగ్య శాఖ సెప్టెంబర్ 1నుంచి అమల్లోకి వచ్చింది.
ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని సైతం బయోమెట్రిక్ హాజరుపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని కచ్చితంగా పాటించాలని వైద్యులు, సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. ఆయుష్ డిస్పెన్సరీలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గురువారం నుంచి అమల్లోకి వచ్చిన బయోమెట్రిక్ హాజరుపై కొందరు వైద్యులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు అసహనం తెలుపుతున్నారు. అయితే ప్రజలకోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తోంది. త్వరలోనే అన్ని శాఖల్లో ‘బయోమెట్రిక్’ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.