
kurnool judicial capital
కర్నూలును న్యాయ రాజధాని చేయాలనే ఆకాంక్షను చాటేందుకు రాయలసీమ ప్రజలు సన్నద్ధమవుతున్నారు. శనివారం తిరుపతిలో చేపట్టనున్న రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన ద్వారా సమరశంఖం పూరించేందుకు సమాయత్తమవుతున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ మహా ప్రదర్శనకు ఇప్పటికే వైసీపీ మద్దతు ప్రకటించింది. అలాగే రాయలసీమ జేఏసీతోపాటు పలు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మద్దతుగా నిలిచాయి. ప్రవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజి యాజమాన్యాలు మహా ప్రదర్శనలో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చాయి.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆత్మగౌరవ మహా ప్రదర్శనకు సంబంధించిన ఫ్లెక్సీని ఆవిష్కరించారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికి జరగదు. రాయలసీమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం.. పదండి’ అంటూ.. భారీ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి భారీగా ఇంద్ర ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వరకు కరపత్రాలు పంపిణీ చేశారు.
ఆత్మగౌరవ మహా ప్రదర్శనను విజయంవంతం చేసి.. రాయలసీమ ఆత్మ గౌరవాన్ని కాపాడాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే ప్రజలకు పిలుపునిచ్చారు. పరిపాలన వికేంద్రీకరణ కు విద్యార్థులు, ప్రజలు సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. రాయలసీమ ఆత్మగౌరవ యాత్ర లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలలన్నారు.
టీడీపీ రాజకీయం?
వికేంద్రీకరణను టీడీపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో టీడీపీపై వైసీపీ ఫైర్ అవుతోంది. అధికార వికేంద్రీకరణ విషయాన్ని టీడీపీ కావాలనే రాజకీయం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. కర్నూలును రాజధాని చేయకుండా అడ్డుకొని.. రాయలసీమకు ద్రోహం చేయొద్దని వేడుకుంటోంది.
విశాఖ గర్జన ఊపుతో..
విశాఖను పరిపాలన రాజధాని చేయాలనే డిమాండ్ తో జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జనను చేపట్టారు. అది విజయవంతం కావడంతో.. అదే ఉత్సాహంతో కర్నూలును న్యాయ రాజధాని చేయాలనే డిమాండ్ తో తిరుపతిలో ఆత్మగౌరవ మహా ప్రదర్శన చేయాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి భావించారు. ప్రదర్శనకు భారీగా జనాలు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పుడు వదులుకోవద్దు..
రాయలసీమలో కర్నూలుకు ఎంతో చరిత్ర ఉన్నది. రాయలసీమకు కర్నూలు ముఖద్వారం లాంటిది. వాస్తవానికి 1953లోనే ఏపీకి రాజధాని కర్నూలు. ఆ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ రాజధానిగా మారింది. ఇన్నాళ్లకు మళ్లీ.. కర్నూలులో పూర్తిస్థాయిలో రాజధాని కాకపోయినా.. కనీసం న్యాయ రాజధాని ఏర్పాటు అవకాశం ఇప్పుడు వచ్చింది. ఈ అవకాశాన్ని వదులుకోవద్దనే ఉద్దేశంతోనే.. ఈ ప్రాంత ప్రజలు ఉద్యమబాట పట్టడానికి సిద్ధమవుతున్నారు.