
Vidada Rajini, Minister of State for Health, Family Welfare & Medical Education
- రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ మంత్రి విడదల రజిని
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందజేయడంలో వైసీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపధికన చర్యలను తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. 75ఏళ్ల సమస్య పరిష్కారానికి జగన్ ప్రభుత్వం గత మూడేళ్ల నుంచి అవిశ్రాంతంగా కృషిచేస్తున్నదని, ఈ సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వం చేసింది శూన్యం అని ఆమె స్పష్టంచేశారు. అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో ఆమె మాట్లాడుతూ.. 2019 లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
మూత్ర పిండాల వ్యాధి గ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 2019 సెప్టెంబర్ మాసంలో రూ.50 కోట్ల అంచనా వ్యయంతో పలాసాలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారన్నారు మంత్రి విడదల రజిని. ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు 75 శాతం పైబడి పూర్తి అయ్యాయని, వచ్చే ఏడాది మార్చి మాసానికల్లా ఈ ఆసుపత్రి సేవలు అందుబాటులోకి రానున్నట్టు ఆమె తెలిపారు.
రూ.742 కోట్ల అంచనా వ్యయంతో సర్పేస్ వాటర్ ప్రాజెక్టు
ఉద్దాన ప్రాంతంలోని ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు తదితర ఏడు మండలాల్లోని నివాశిత ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో రూ.742 కోట్ల అంచనా వ్యయంతో సర్పేస్ వాటర్ ప్రాజెక్టు నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వమే శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు పనులు కూడా 80 శాతం వరకూ పూర్తి అయ్యాయని, వచ్చే ఏడాది మార్చి నాటికల్లా ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానున్నట్లు ఆమె తెలిపారు. ఉద్దాన ప్రాంతంలోని అన్ని గ్రామాలకు 142 ఆటోమేటెడ్ వాటర్ డిస్పెన్సర్ల ద్వారా 24 గంటలూ సురక్షిత త్రాగునీటి పంపిణీచేస్తున్నామన్నారు మంత్రి విడదల రజిని.
ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీవ్యాధికారకాలను గుర్తించేందుకు జార్జి ఇన్ స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ (జిఐజిహెచ్), న్యూడిల్లీకి చెందిన టీఈఆర్ఐ, ఐసీఎంఆర్ తో త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. వచ్చే వారంలో ఈ బృందం ప్రభుత్వానికి తమ మద్యంతర నివేదికను అందజేయనున్నట్లు ఆమె తెలిపారు.
ఉద్దాన ప్రాంతంలోని ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస మరియు వజ్రపుకొత్తూరు మండలాల్లోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 ప్రాథమికోన్నత ఆరోగ్య కేంద్రాలు, 6 సామాజిక ఆరోగ్య కేంద్రాలలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలను అందించడం జరుగుచున్నదని మంత్రి తెలిపారు. ప్రాథమిక దశలోనే దీర్ఝకాలిక మూత్రపిండాల వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి అవసరమైన ఔషదాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఉద్దానం ప్రాంతంలో రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేయడం జరుగుచున్నదన్నారు. ఇప్పటి వరకూ 1 లక్షా 25 వేల 506 మందికి స్క్రీనింగ్ లు పూర్తిచేసి, 21,861 మందికి వైద్య సేవల నిర్వహణ, 791 మందికి డయాలసిస్ సేవలను అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. సీరం క్రియాటిన్, రక్తం యూరియా స్థాయిలను పరీక్షించేందుకు సెమీ ఆటో ఎనలైజర్స్ తో 17 లేబొరేటరీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు మంత్రి విడదల రజిని.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సంబందిత అధికారులతో సమగ్ర సమీక్ష అనంతరం అదనంగా మరో 11 ఎనలైజర్స్ కొనుగోలుకు చర్యలను చేపట్టడం జరిగిందన్నారు. కవిటి, సోంపేట, పలాస, హరిపురం సి.హెచ్.సి.లు మరియు టెక్కలి జిల్లా ఆసుపత్రిలో 65 డయాలసిస్ మెషిన్స్ తో 5 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలను అందజేయడం జరుగుచున్నదని ఆమె తెలిపారు. డా.వైఎస్సార్ పించను కానుక క్రింద 3,4 దశల్లోని వ్యాధిగ్రస్తులకు రూ.5 వేలు, డయాలసిస్ చేయించుకుంటున్న వారి రూ.10 వేలను ప్రభుత్వం ప్రతి మాసం కిడ్నీ రోగులకు అందజేస్తున్నది ఆమె తెలిపారు.