
anakapalle round table conference
వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్రమంతా శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహించాలని ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు నిర్ణయించారు. వికేంద్రీకరణ ఆకాంక్ష ప్రపంచానికే చాటేలా.. రోజుకొక నియోజకవర్గంలో బంద్ లు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. మాజీ వీసీ, ఉత్తరాంధ్ర నాన్పొలిటికల్ జేఏసీ చైర్మ న్ లజపతిరాయ్ అధ్యక్షతన అనకాపల్లిలో జరిగిన ఉత్తరాంధ్ర మేధావులు రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి విశాఖను రాజధానిగా చేయడమే మార్గమని నినదించారు. ఏయూ ప్రొఫెసర్ షోరాన్ రాజ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు పక్కి దివాకర్, జేఏసి వైస్ చైర్మన్ దేముడు నాయుడు తదితరులు మాట్లాడారు.
ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ఉత్తరాంధ్ర జేఏసీ ఉద్యమిస్తోందని నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ లజపతిరాయ్ అన్నారు. మద్రాస్ నుంచి విడిపోయిన సమయంలో తొలుత విశాఖనే రాజధానిగా ప్రతిపాదించారని గుర్తుచేశారు. 1956 లోనే విశాఖ రాజధాని కావాలని అప్పటి అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు. ఇప్పటికైనా మూడు రాజధానులు ఏర్పాటు చేయకుంటే భవిష్యత్తులో రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. అమరావతి యాత్ర ఇప్పటికైనా విరమించుకోవాలని జేఏసీ హెచ్చరిస్తోందని చెప్పారు.
వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు. అన్ని ప్రాంతాలు బావుండాలని.. అందరూ బావుండాలనేది వైఎస్సార్సీపీ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ రాజధాని కోరుకోవడం లేదని కొందరు టీడీపీ ఉత్తరాంధ్ర ద్రోహులు ప్రచారం చేస్తున్నారన్నారు.
విశాఖ పరిపాలన రాజధాని అన్నది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అన్నారు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. పరిపాలన వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానమన్నారు. అమరావతిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయా లంటే రూ.ఐదారు లక్షలకోట్లు ఖర్చవుతుందని, చంద్రబాబు ఐదేళ్ల కాలంలో అమరావతికి రూ.6 వేలకోట్లు మాత్ర మే ఖర్చు చేశారన్నారు. అందులోనూ రూ.4,500 కోట్లు అప్పు. మిగతా రూ.1,500 కోట్లలో రూ.వెయ్యికోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఈ లెక్కన ఆ ఐదేళ్లలో కేవలం రూ.500 కోట్లు మాత్రమే అమరావతికి ఖర్చుచేశారన్నారు. విశాఖకు పరిపాలన రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయని, చంద్రబాబు నిస్సిగ్గుగా విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్నారన్నారు.
జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఉత్తరాంధ్ర జేఏసీ ఏర్పాటు చేసిన నెల రోజుల్లోనే ఉద్యమం ఉధృతమైందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు పరిపాలన రాజధానిగా విశాఖను కోరుకోవడంలేదని చెప్పే ప్రతీ ఒక్కరికీ విశాఖ గర్జన ఒక సమాధానం అన్నారు. అమరావతి రైతుల పేరిట నిర్వహించే దండయాత్ర కారణంగానే ఈ ఉద్యమం మరింత ఉధృతం అయ్యిందన్నారు.