
arrangements speed up by government to procure kharif paddy in andhra pradesh
రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ధాన్యం సేకరణ ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పూర్తి పారదర్శకంగా కొనుగోళ్లు జరిపేలా చర్యలు చేపడుతున్నారు. వచ్చే నవంబర్ మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ షురూ అయ్యే అవకాశం ఉంది.
37 లక్షల టన్నుల ధాన్యం సేకరణ!
వరి సాగు విస్తీర్ణం, పంట దిగుబడిపై అంచనాల ప్రకారం ఈసారి 37 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ధాన్యం సేకరణలో ఈసారి వాలంటీర్ల సేవలను కూడా ఉపయోగించుకోనున్నారు. ఇందుకు గాను వాలంటీర్లకు నెలకు రూ.1500 ప్రోత్సాహకంగా అందించనున్నారు. ధాన్యం సేకరణ కోసం 2, 3 ఆర్బీకేలను కలిపి క్లస్టర్స్‌గా ఏర్పాటు చేయనున్నారు. ఈ క్లస్టర్స్‌ను కేటగిరీ ఏ, బీ, సీలుగా విభజించనున్నారు. 2 వేల టన్నుల సేకరణ ఉండేవాటిని కేటగిరీ ఏ కింద, 1000-2000 టన్నుల మధ్య సేకరణ ఉంటే కేటగిరీ బీ కింద, వెయ్యి లోపు సేకరణ ఉంటే కేటగిరీ సీగా గుర్తించనున్నారు.
ఆర్బీకేల్లో ఈ క్రాప్ జాబితా ప్రదర్శన
ఈ నెల 16 నుంచి ఆర్బీకేల్లో ఈ క్రాప్ జాబితాను అందుబాటులో ఉంచనున్నారు. ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే సవరిస్తారు. వెబ్‌ల్యాండ్, కౌలు రైతులకు ఇచ్చే పంట హక్కు పత్రాల ద్వారా రాష్ట్రంలో 100 శాతం ఈ క్రాప్ నమోదు పూర్తి చేశారు.
మిల్లర్ల కొర్రీలకు చెక్ పెట్టేలా :
ఇటీవలే జగన్ సర్కార్ వరి పంట మద్దతు ధరను క్వింటాలుకు రూ.100 మేర పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఏ గ్రేడ్ రకం వరి ధర క్వింటాకు రూ.2060, సాధారణ రకం ధర క్వింటాకు రూ.2040 వరకు చేరింది. ప్రభుత్వం మద్దతు ధర పెంచినప్పటికీ మిల్లర్ల కొర్రీలతో రైతులు నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. తేమ శాతం ఎక్కువ ఉందనో.. తూకంలో తేడా ఉందనో ధరల్లో కోత పెడుతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం మిల్లుల వద్ద కస్టోడియన్ అధికారితో పర్యవేక్షణ చేపట్టనుంది. ధాన్యం సేకరణ సందర్భంగా గోనె సంచులు, హమాలీలు, రవాణా కూడా ప్రభుత్వమే చూసుకోనుంది. ఒకవేళ రైతులే ఆ ఏర్పాట్లు చేసుకుంటే అందుకయ్యే ఖర్చును ప్రభుత్వం వారి ఖాతాల్లో జమచేయనుంది.