
assembly session
ఈ నెల 15 వ తేదీ నుంచి జరుగనున్న ఆంద్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభా సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు, స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్ని శాఖల కార్యదర్శులను, పోలీస్ అధికారులను కోరారు. సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలను సకాలంలో అందజేయాలని అన్ని శాఖల కార్యదర్శులకు సూచించారు. సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసన సభ కమిటీ హాల్ లో పలు శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులతో వేరు వేరుగా జరిగిన సమావేశాల్లో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు మాట్లాడుతూ.. సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సరైన సమాధానాలను అందజేస్తూ వారి గౌరవాన్ని కాపాడాల్సి భాద్యత అధికారులపై ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీల మెడికల్ బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడే మాజీ ఎమ్మెల్సీలకు అందజేసే ఔషధాలను వారు నివశించే ప్రాంతాల్లోనే అందజేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ఆయన సూచించారు. ప్రశాంత వాతావరణంలో సమావేశాలు కొనసాగేలా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లను చేయాలని డీజీపీని కోరారు.
సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ.. శాసనసభా సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ సమావేశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారన్నారు. సభ్యుల గౌరవంతోనే సభ గౌరవం ముడిపడిఉందనే అంశాన్ని అధికారులు అందరూ గుర్తించాలన్నారు. మాజీ శాసన సభ్యులకు ప్రభుత్వ పరంగా అందజేసే వైద్య సేవలను మరింత మెరుగు పర్చాలన్నారు. ఈ సమావేశాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు.
సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజు, చీఫ్ కో-ఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ కె.రాజేంద్రనాద్ రెడ్డి, శాసన సభ సెక్రటరీ పి.బాలకృష్ణమాచార్యులు, శాసన మండలి ఓ.ఎస్.డి. కె.సత్యనారాయణరావు తదితరులతో పాటు పలు శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.