
tirumala tirupati devasthanam
తిరుమల పుణ్యక్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు ఐదో తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలను ఆలయానికే పరిమితం చేసి, వాహనసేవలను ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది కొవిడ్ తగ్గడంతో బ్రహ్మోత్సవాలను భక్తుల మధ్య ఆలయ నాలుగుమాడవీధుల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లతోపాటు భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా వివిధ రకాల సౌకర్యాలను సమకూర్చడానికి ఇప్పటికే ఉన్నతాధికారులు, పోలీసు, విజిలెన్స్ అధికారులు సమావేశమైన విషయం తెలిసిందే.
ఉత్సవాలు సమీపిస్తుండటంతో తిరుమలలో ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఆధునికీకరణ, సుందరీకరణ, అలంకరణ, మరమ్మతులు ఊపందుకున్నాయి. ఆలయ మహద్వారం గోపురానికి రంగులు వేయడం పూర్తికావడంతో ప్రస్తుతం ప్రాకారానికి కూడా రంగులు వేస్తున్నారు. వాహనాల ఊరేగింపు సమయంలో భక్తులకు ఇబ్బంది లేకుండా గ్యాలరీలు, బారికేడ్లు, ఇనుపగేట్లను అమర్చుతున్నారు. ఇప్పటికే అమర్చిన గ్యాలరీలకు పెయింటింగ్ చేస్తున్నారు. భక్తులు వేచిఉండే గ్యాలరీల్లో తాగునీటి సౌకర్యాలను మరింతగా మెరుగు పరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
నాలుగు మాడ వీధుల్లో బ్రహ్మోత్సవాలు: ఈవో
నాలుగు మాడ వీధుల్లో అంగ రంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో ధర్మారెడ్డి చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, రక్షణ సిబ్బందికి ప్రత్యేక దర్శనం తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఆర్జిత సేవలు, రూ.300/- దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్టు దాతలకు, ఇతర ట్రస్టుల దాతలకు దర్శన టికెట్లు కూడా నిలిపివేసినట్లు తెలిపారు.
గదులకు సంబంధించి ఆన్లైన్లోనే భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా 50శాతం గదులను అందుబాటులో ఉంచామన్నారు. తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తిరుపతిలోనే గదులు పొంది బస చేయాలని విజ్ఞప్తి చేశారు. సాధారణ రోజుల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు.
బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11.30 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు. గరుడ సేవ రోజు రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. వాహనసేవల ముందు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి అపురూపమైన కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.