
mangalagiri jagananna smart townships
జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ ద్వారా మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను వైసీపీ ప్రభుత్వం సాకారం చేస్తోంది. ఈ స్కీమ్ కింద మంగళగిరిలో అభివృద్ధి చేసిన ప్లాట్ల ఈ వేలానికి రంగం సిద్ధమైంది. ప్లాట్ల ధర, విక్రయం, రాయితీలకు సంబంధించిన పూర్తి వివరాలను తాజాగా ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్లాట్లపై భారీ రాయితీ ప్రకటించారు.
ధర ఎంత… రాయితీ ఎంత.. :
మంగళగిరిలో అభివృద్ధి చేసిన జగనన్న స్మార్ట్ టౌన్షిప్లో ఎంఐజీ లేఅవుట్-2లో మొత్తం 267 ప్లాట్లు ఉన్నాయని వివేక్ యాదవ్ తెలిపారు. వీటిల్లో 200 గజాల ప్లాట్లు 68 ఉండగా, 199 గజాల ప్లాట్లు 240 ఉన్నాయి. ఒక్కో ప్లాటుకు చదరపు గజం ధర రూ.17,499గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ లేఅవుట్లో 10 శాతం ప్లాట్లు ప్రస్తుతం మంగళగిరిలో నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకే రిజర్వ్ చేసినట్లు చెప్పారు. అంతేకాదు, ప్లాట్ ధరపై వారికి 20 శాతం మేర రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇక రిటైర్డ్ ఉద్యోగులకు 5 శాతం ప్లాట్లను రిజర్వ్ చేసినట్లు తెలిపారు.
ఈ-లాటరీ ద్వారా లబ్దిదారుల ఎంపిక :
మంగళగిరి జగనన్న స్మార్ట్ టౌన్షిప్లో ప్లాట్లు కొనుగోలు చేయాలనుకునేవారు ప్లాట్ ధరలో 10 శాతాన్ని చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చునని వివేక్ యాదవ్ తెలిపారు. ఈ-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ప్లాట్ పొందిన లబ్ధిదారులు ఏపీసీఆర్డీఏ నిర్ణయించిన ప్లాట్ ధరలో 30 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాతి 6 నెలల్లో సులభ వాయిదాల్లో మరో 30 శాతం, ఏడాది లోపు మిగతా 30 శాతం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి మొత్తం చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ ఉంటుందని తెలిపారు.
ఇలా దరఖాస్తు చేసుకోవాలి :
ప్లాట్ నికర ధరలో 60 శాతంపై మాత్రమే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉంటాయని వివేక్ యాదవ్ తెలిపారు. ఒకవేళ లబ్ధిదారులు ఒకేసారి మొత్తం ధరను చెల్లిస్తే 5 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. ప్లాట్లు కొనుగోలు చేసే ఆసక్తి ఉన్నవారు నవంబర్ 19 లోగా https://migapdtcp.ap.gov.in, https://crda.ap.gov.in వెబ్ సైట్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు 0866-2527124 నంబర్లో సంప్రదించవచ్చునని సూచించారు.