
ap womens commission issues notices to pawan kalyan and demands apology over insulting comments against women
విశాఖ గర్జన నాటి నుంచి పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం రోజూ వార్తల్లో నానుతూనే ఉంది. కోట్ల రూపాయలు భరణంగా ఇచ్చి విడాకులు తీసుకుని మూడు పెళ్లిళ్లు చేసుకున్నానంటూ పవన్ పేర్కొనడం… చేతనైతే మీరూ మూడు పెళ్లిళ్లు చేసుకోండని వ్యాఖ్యానించడం పట్ల మహిళా లోకం మండిపడుతోంది. పవన్ వ్యాఖ్యల పట్ల ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర స్థాయిలో స్పందించారు. పవన్ వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మహిళా కమిషన్ నుంచి పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేశారు.
మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు : వాసిరెడ్డి పద్మ
‘ఇటీవల మీరు మూడు పెళ్ళిళ్లపై చేసిన వ్యాఖ్యలు సమాజంలో పెద్ద దుమారం రేపాయి. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చు అనే సందేశం మీ మాటల్లో వ్యక్తమైంది. మీ మాటలతో మహిళాలోకం షాక్‌కు గురైంది. మీ మాటల్లోని తప్పును తెలుసుకుని మహిళాలోకానికి మీరు వెంటనే సంజాయిషీ ఇస్తారని రాష్ట్ర మహిళా కమిషన్ ఎదురుచూసింది. ఇన్నిరోజులైనా మీ మాటలపై మీలో పశ్చాత్తాపం లేదు. మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసినందుకు మీ నుంచి క్షమాపణలూ లేవు. ఎవరి జీవితంలో అయినా మూడు పెళ్ళిళ్లు చేసుకోవలసి వస్తే అది ఖచ్చితంగా వ్యతిరేక అంశమే..’ అంటూ వాసిరెడ్డి పద్మ పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలంటే అంత చులకనా.. : వాసిరెడ్డి పద్మ
‘కోట్ల రూపాయలు భరణంతో విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను.. చేతనైతే మీరూ చేసుకోండంటూ.. అత్యంత సాధారణ విషయంగా ఎలా మాట్లాడగలిగారు. కోట్లు, లక్షలు, వేలు ఎవరి స్థాయిలో వారు భరణం ఇచ్చి భార్యను వదిలించుకుంటూపోతే.. ఏ మహిళ జీవితానికి భద్రత ఉంటుంది. ఒక సినిమా హీరోగా, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మూడు పెళ్ళిళ్లపై మీ మాటల ప్రభావం సమాజంపై ఉంటుందని మీకు తెలియదా. మిమ్మల్ని ఫాలో అవుతున్న యువత చేతనైతే మూడు పెళ్ళిళ్లు చేసుకోవచ్చు అనే అభిప్రాయాన్ని తలకెత్తుకోరా..? మీ ప్రసంగంలో మహిళలను ఉద్దేశించి ‘స్టెప్నీ’ అనే పదం ఉపయోగించడం తీవ్ర ఆక్షేపణీయం’ అని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.
ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలతో తిరిగే సన్నాసుల్లారా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై వాసిరెడ్డి పద్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలను భోగ వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు ఇటువంటి పదాలను ఉపయోగిస్తారని మండిపడ్డారు. ‘మీ వ్యాఖ్యలపై ఇప్పటికే అనేక మంది మహిళలు మాకు ఫిర్యాదు చేశారు. మీ మాటలు అవమానకరంగా మహిళా భద్రతకు పెను ప్రమాదంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడటం, చేతనైతే మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని పిలుపునివ్వడంపై మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ మీకు ఈ నోటీసును జారీ చేస్తుంది.’ అని పవన్‌కు జారీ చేసిన నోటీసుల్లో వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.
వివరణ ఇవ్వకపోతే చూస్తూ ఊరుకోం : వాసిరెడ్డి పద్మ
మహిళా కమిషన్ నోటీసులకు పవన్ కల్యాణ్ వివరణ ఇవ్వకపోతే చూస్తూ ఊరుకోమని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. పవన్ కల్యాణ్ క్షమించరాని తప్పు చేశారని… ఆ తప్పును కూడా టీడీపీ, జనసేన నేతలు సమర్థిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల జీవితాన్ని భరణంతో వెలకట్టగలరా అంటూ ప్రశ్నించారు. పెళ్లి అనేది భార్యాభర్తల బంధం.. దానిపై పవన్ బాధ్యత లేకుండా మాట్లాడటంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం, 30 మందితో ఉండటం వ్యక్తిగత చౌకబారుతనమని విమర్శించారు. పవన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు.