
British Deputy High Commissioner HE Gareth Wynne
- ఫ్యామిలీ ఫిజిషయన్ వైద్య విధానానికి సహకారం అందిస్తాం
- 104, 108 కాల్ సెంటర్లు యూకేలోనూ అమలయ్యేలా చూస్తాం
- బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ హెచ్ఈ గారెత్ విన్ ఓవెన్
విద్య, వైద్య రంగాల అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ హెచ్ఈ గారెత్ విన్ ఓవెన్ తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినితో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూకే- భారత్ మధ్య విద్యార్థుల పరస్పర మార్పిడి విధానం అమలులో ఉందని, ఈ విధానంతో భారతీయ విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. ముఖ్యంగా వైద్య విద్యలో అత్యాధునిక విధానాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానపై భారతీయ విద్యార్థులకు కావాల్సినంత పట్టు లభిస్తుందని తెలిపారు. ఈ విషయంలో ఇక్కడి విద్యార్థులకు తాము దగ్గరుండి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తాను స్వయంగా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలోని 104, 108 కాల్ సెంటర్లను సందర్శించానని, అద్భుతంగా పనిచేస్తున్నాయని, ఇలాంటి వ్యవస్థలను యూకేలోనూ నెలకొల్పేలా చూస్తామని తెలిపారు.
బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో 104, 108 కాల్‌సెంటర్ల గురించి ప్రచురిస్తామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం క్యాన్సర్ వైద్యం కోసం అత్యాధునిక పద్ధతులు అనుసరించే ప్రయత్నం చేస్తోందని, అందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని, ఈ విషయంలో తాము కూడా ఏపీ ప్రభుత్వానికి నిధుల సహకారం గురించి ప్రయత్నిస్తామని చెప్పారు. కొత్తగా 17 మెడికల్ కళాశాలలను ఏపీలో నిర్మిస్తుండటం ప్రశంసనీయమన్నారు. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) యాక్షన్ ప్లాన్ పై నవంబరు 25, 26 తేదీల్లో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరగబోతున్న కాన్ఫరెన్సులో తాము కూడా భాగమవుతామని చెప్పారు. బ్రిటన్ లో నేషనల్ హెల్త్ సర్వీస్ స్కీమ్ ద్వారా ఉచితంగా వైద్యం ప్రజలకు అందుతున్నదని, అదేవిధంగా ఏపీలో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా 85 శాతం కుటుంబాలకు పూర్తి ఉచితంగా వైద్యం అందిస్తుండటం హర్షణీయమని ప్రశంసించారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ అతి త్వరలో తాము ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయబోతున్నామని తెలిపారు. ఈ విధానానికి సంబంధించిన వివరాలను డిప్యూటీ హై కమిషనర్‌కు వివరించారు. ఆశ్చర్యపోయిన హై కమిషనర్ యూకేలోనూ జనరల్ ప్రాక్టీషనర్స్ సర్వీసెస్ పేరుతో ఇలాంటి విధానాన్నే అమలు చేస్తున్నామని, ఇప్పుడు ఏపీలో అమలు చేయబోతున్న ఫ్యామిలీ ఫిజిషయన్ వైద్య విధానానికి తమ వంతు సహకారం అందిస్తామని వివరించారు.
అనంతరం మంత్రి రజిని మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య రంగం బలోపేతానికి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా రూ.16వేల కోట్ల కుపైగా నిధులు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఆస్పత్రుల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తున్నామన్నారు. విద్య, వైద్య రంగాల్లో జగనన్న సమూల మార్పులు తీసుకొస్తున్నారని తెలిపారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, విద్యా వసతి లాంటి పథకాల ద్వారా కేజీ నుంచి పీజీ వరకు పూర్తి ఉచితంగా రాష్ట్రంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదన్నారు. ఆరోగ్యశ్రీ పథకం, బలోపేతమవుతున్న ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు పూర్తి ఉచితంగా తమ ప్రభుత్వం అందజేస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జీఎస్ నవీన్‌కుమార్, ఏపీవీవీపీ కమిషనర్ వినోద్ కుమార్ కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్, ఎన్ హెచ్ ఎం మిషన్ డైరెక్టర్ జె.నివాస్, బ్రిటిష్ కమిషనరేట్ నుంచి డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ వరుణ్‌మాలి, పొలిటికల్ ఎకానమీ అడ్వైజర్ నళిని రఘురామన్, మరో డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ కేటీ రాజన్ తదితరులు పాల్గొన్నారు