
జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు | కళాశాలల పరిధిలోకి జిల్లాలోని అన్ని ఆసుపత్రులు | కేంద్ర నిధుల కోసం ప్రయత్నాలు
ఆంధ్రప్రదేశ్ మెడికల్ హబ్‌గా మారబోతోంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు కాబోతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత అధునాతన వైద్య సదుపాయాలు అందించే ఆసుపత్రులకు ఏపీలో కొరత ఏర్పడింది. కార్పొరేట్ ఆసుపత్రులన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయి. 2014 నుంచి ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలతో కొన్ని ఆసుపత్రులు, ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి. పెరుగుతున్న జనాభాకు తగిన స్థాయిలో మాత్రం వైద్య సేవలు అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు జిల్లాకో మెడికల్ కాలేజ్ కేటాయించడంతో ఆ కొరత తీరనుంది.
పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా..
ఏదైనా పెద్ద జబ్బు చేస్తే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్తుంటారు. అక్కడ ట్రీట్మెంట్ ఖరీదైనదే కాకుండా.. దూరాభారంగా ఉంటుంది. విభజన నుంచి ఈ పరిస్థితి కొనసాగుతోంది. కరోనాలో ఎన్ని అవస్థలు పడాల్సి వచ్చిందో అందరం చూశాం. విభజన హామీల్లో ఒకటైన ఆలిండియా మెడికల్ సైన్సెస్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెరుగుతున్నాయి. కొత్తగా 26 జిల్లాల్లో మెడికల్ కళాశాలలు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్‌కు భవనాలను రెడీ చేస్తున్నారు. 2024లో అడ్మిషన్లు ప్రారంభం కాబోతున్నాయి.
బోధనాసుపత్రుల పరిధిలోకే అవన్నీ..
జిల్లాకొకటి చొప్పున ఏర్పాటయ్యే బోధనాసుపత్రుల పరిధి పెరుగుతోంది. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్స్ మెడికల్ కాలేజీల పరిధిలోకి వస్తాయి. కొత్త కాలేజీలతో కొత్త ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. చెప్పిన ప్రకారం అవన్నీ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ మరో మెడికల్ హబ్‌గా మారుతుంది. వైద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.