
hydrogen hub
- నెల్లూరు, విశాఖపట్నంలో ఉత్పత్తికి ప్రణాళికలు
సంప్రదాయ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా కేంద్రం ప్రతిపాదించిన హైడ్రోజన్ ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ ముఖ్య కేంద్రంగా రూపొందనుంది. రాబోయే 20 ఏళ్లలో పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి సంప్రదాయ ఇంధన వనరులను క్రమంగా తగ్గించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. ఈ స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తేవడం ద్వారా భూతాపం, కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. అందుకోసం జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాల్లో ఏపీ భాగం అవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం ఎంపిక చేసిన ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. రాష్ట్రంలోని విశాఖ, నెల్లూరు జిల్లాల్లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయనున్నారు.
కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖకు, నీతీ ఆయోగ్‌కు ఇండియా హైడ్రోజన్ అలయన్స్ (ఐహెచ్2ఏ) ఇటీవల సమర్పించిన హైడ్రోజన్ హబ్ డెవలప్మెంట్ ప్లాన్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ హబ్‌లను రూపొందిస్తారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో ఐదు జాతీయ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు ఏర్పాటు చేసి, వీటిని 25 ప్రాజెక్ట్ క్లస్టర్లుగా విభజించాలని నిర్ణయించారు.
ఈ హబ్‌ల ద్వారా 2025 నాటికి గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలనేది లక్ష్యంగా ఉంది. అందుకోసం 150 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఐహెచ్2ఏ నిర్దేశించింది. వీటిని ఫస్ట్ జనరేషన్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులుగా పేర్కొంటున్నారు. ఈ గ్రీన్ హైడ్రోజన్‌ను వివిధ రంగాలకు చెందిన సంస్థలు ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రారంభం కావాలే గానీ, వినియోగానికి అనేక మార్గాలు ఉన్నాయి. రాబోయే కాలంలో పెట్రోల్, డీజిల్ వంటి సంప్రదాయ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్‌ను వినియోగించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ స్థాయిలో నిర్ణయాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా 20 సంవత్సరాలు లక్ష్యంగా హైడ్రోజన్ ఉత్పత్తిని, వినియోగాన్ని పెంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాబోయే భవిష్యత్తు అంతా పునరుత్పాదక ఇంధనాల వినియోగానిదేనని స్పష్టం చేస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులో భాగంగా బళ్లారి– నెల్లూరు (కర్ణాటక– ఆంధ్రప్రదేశ్) మధ్య నేషనల్ గ్రీన్ స్టీల్, కెమికల్స్ కారిడార్‌లోని స్టీల్, కెమికల్ ప్లాంట్ల కోసం 30 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ప్లాంట్‌తో సంవత్సరానికి 5 వేల టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారు. దీనివల్ల పదేళ్లలో వాతావరణంలో 5 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను తగ్గించవచ్చని అంచనాలు ఉన్నాయి.
విశాఖపట్నంలో నేషనల్ గ్రీన్ రిఫైనరీ ట్రాన్స్ పోర్ట్ హబ్‌లో 20 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ప్లాంట్‌తో సంవత్సరానికి 4 వేల టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారు. ఇది ఒక దశాబ్దంలో 4 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను తగ్గిస్తుంది. దీని కోసం రాష్ట్ర గ్రీన్ హైడ్రోజన్ విధానాలను రూపొందించనున్నారు. ఈ విధంగా అవకాశం ఉన్న అన్ని చోట్లా హైడ్రోజన్ వినియోగం పెంచాలనే ఆలోచనలు ఉన్నాయి. కనుక ఏపీలో ఏర్పాటు కాబోయే హైడ్రోజన్ హబ్‌లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.