
ap govt special focus on north andhra irrigation projects here is the status of current works
ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోందంటూ ప్రతిపక్ష అనుకూల మీడియా చేస్తున్న ప్రచారాన్ని అధికార వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతా అంశంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను చేపడితే… దుర్మార్గపూరితంగా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి పూనుకుంటున్నారని మండిపడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్దితో వ్యవహరిస్తోందో రాష్ట్ర జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణ రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞం కింద ఉత్తరాంధ్రలో పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని నారాయణరెడ్డి గుర్తుచేశారు. టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టుల పేరు చెప్పి వారి అనుయాయులకు వందల కోట్ల రూపాయలు దోచి పెట్టారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టిందని.. ఖర్చు పెట్టే ప్రతీ పైసా ప్రజలకు లబ్ధి చేకూర్చాలనే ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. ఉత్తరాంధ్రలో ఏయే ప్రాజెక్టుల పనులు ఎంతవరకు పూర్తయ్యాయో వెల్లడించారు.
వంశధార ప్రాజెక్ట్ ఫేజ్-2 పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయని నారాయణ రెడ్డి తెలిపారు. ఫేజ్-2 ద్వారా 27,800 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 225 గ్రామాల్లోని పంట పొలాలకు దీని ద్వారా సాగునీరు అందుతుందన్నారు. ఇదే ఫేజ్-2 ద్వారా హీరమండలం రిజర్వాయర్ నుంచి 1.2 టీఎంసీల నీటిని కిడ్నీ వ్యాధి పీడిత ప్రాంతమైన ఉద్ధానానికి సప్లై చేయవచ్చునని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం వంశధార నిర్వాసితులను గాలికి వదిలిస్తే… వైసీపీ ప్రభుత్వం వారికి అదనపు ప్రయోజనం కల్పించేందుకు రూ.217 కోట్లు మంజూరు చేసిందన్నారు. వంశధార నదిపై గొట్టా బ్యారేజీ ద్వారా హీరమండలం రిజర్వాయర్‌కు 12 టీఎంసీల నీటిని అందించేందుకు రూ.176 కోట్లు మంజూరు చేసిందన్నారు.
వంశధార-నాగావళి అనుసంధానం:
వంశధార-నాగావళి అనుసంధానం ద్వారా 18,527 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు 4 మండలాల్లో 38 గ్రామాల పరిధిలోని 5 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించేందుకు కృషి జరుగుతోందని ఇంజనీర్-ఇన్-చీఫ్ నారాయణ రెడ్డి తెలిపారు.ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.145 కోట్ల మంజూరుకు అనుమతిచ్చిందని, దీనికి సంబంధించి 70 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయని అన్నారు. మిగతా పనులు వచ్చే జూన్ నాటికి పూర్తవుతాయని తెలిపారు.
గజపతినగరం బ్రాంచి కాలువ పనులు:
ప్రస్తుతం విజయనగరం జిల్లాలో గణపతినగరం బ్రాంచి కాలువలు పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే 43 శాతం పనులు పూర్తయ్యాయని.. భూసేకరణలో ఇబ్బందుల కారణంగా మిగతా పనులు ముందుకు సాగడం లేదని అన్నారు. తోటపల్లి కుడి ప్రధాన కాలువను 97.70 కి.మీ నుంచి 45 కి.మీ మేర పొడిగించి గణపతినగరం బ్రాంచి కాలువ ద్వారా విజయనగరం జిల్లాలోని ఆరు మండలాల్లో 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చునని అన్నారు.
తారకరామతీర్థసాగరం:
విజయనగరం జిల్లా గుర్ల మండలంలో చంపావతి నదికి అడ్డంగా తారకరామతీర్థ సాగరం బ్యారేజి పనులు ఇప్పటికే 59 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మిగతా పనులకు రూ.198 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని.. త్వరలోనే రివర్స్ టెండర్స్ ద్వారా గుత్తేదారులకు పనులకు అప్పగించడం జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 49 గ్రామాల్లో 16,538 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు.
డా.బీఆర్ అంబేడ్కర్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి
ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు పరిశ్రమలకు నీటిని అందించే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రూ.7,214 కోట్ల అంచనా వ్యయంతో డా.బీఆర్ అంబేడ్కర్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని తెలిపారు. గత టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టు పనుల్లో ఎటువంటి పురోగతి లేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అంచనాలను సవరించి రూ.17,411 కోట్లతో ఫేజ్ 2 కింద రెండు ప్యాకేజీలను చేపట్టడం జరిగిందన్నారు.ప్రాజెక్ట్ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి జరుగుతోందన్నారు.
మడ్డువలస రిజర్వాయర్
మడ్డువలస రిజర్వాయర్ ప్రాజెక్టు ఫేజ్ 2 పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. మడ్డువలస రిజర్వాయర్ కుడి కాలువను విస్తరించి 12500 ఎకరాల అదనపు ఆయకట్టుకు దీని ద్వారా 1.5 టీఎంసీల నీళ్లు అందించడం జరుగుతుందన్నారు. ఈ పనులు ఇప్పటికే 79 శాతం పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే ఖరీఫ్ నాటికి మిగతా పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు.
తోటపల్లి బ్యారేజి, మహేంద్ర తనయ :
విజయనగరం జిల్లా తోటపల్లి వద్ద నాగావళి నదిపై బ్యారేజి నిర్మాణం 83 శాతం పూర్తయిందని, మిగతా పనులను రెండు ప్యాకేజీలుగా చేపట్టడం జరిగిందన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ పనులు పూర్తవుతాయని తెలిపారు. మహేంద్ర తనయ షో ఆఫ్ రిజర్వాయర్ ద్వారా 2024 ఖరీఫ్ నాటికి 24,600 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. త్వరలోనే రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.