
ap govt plans to set up transgenders welfare board to protect their rights and for welfare
సమాజంలో ట్రాన్స్‌జెండర్స్ పట్ల ఉన్న వివక్ష, అపోహలు, చులకన భావాన్ని తొలగించి వారి అభ్యున్నతి కోసం పాటుపడేందుకు ‘ట్రాన్స్‌జెండర్స్ సంక్షేమ బోర్డు’ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు మొదలైంది. ట్రాన్స్‌జెండర్స్ హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమమే ధ్యేయంగా ఈ బోర్డు పనిచేస్తుంది.
ప్రభుత్వ అంచనా ప్రకారం రాష్ట్రంలో దాదాపు 40 వేల మంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు. ప్రాథమిక ప్రతిపాదనల ప్రకారం.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ట్రాన్స్‌జెండర్స్ సంక్షేమ బోర్డుకు ఛైర్‌పర్సన్‌గా ఉంటారు. స్కూల్ ఎడ్యుకేషన్, పోలీస్, స్కిల్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ తదితర ప్రభుత్వ శాఖల ప్రతినిధులు ఈ బోర్డులో సభ్యులుగా ఉంటారు. అలాగే, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన కొందరు వ్యక్తులను కూడా సభ్యులుగా బోర్డులోకి తీసుకునే అవకాశం ఉంటుంది.
ట్రాన్స్‌జెండర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా చేపట్టే కార్యక్రమాలు
ట్రాన్స్‌జెండర్స్ కమ్యూనిటీ సమగ్రాభివృద్ధే ‘ట్రాన్స్‌జెండర్స్ సంక్షేమ బోర్డు’ ప్రధాన లక్ష్యంగా ఉంటుందని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ జీఎస్ నవీన్ కుమార్ పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్స్ ఉనికి పట్ల సమాజామోదం, సమాజం ట్రాన్స్‌జెండర్స్‌ను కలుపుకుని ముందుకెళ్లేలా చర్యలు తీసుకోవడం ఈ బోర్డు ద్వారా చేపట్టే మొదటి చర్యలని పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్స్ ఆత్మగౌరవంతో కూడిన జీవనం సాగించేందుకు, సామాజికంగా-ఆర్థికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా, నైపుణ్యాభివృద్ధి పరంగా వారికి తగిన తోడ్పాటు అందించేందుకు బోర్డు కృషి చేస్తుందన్నారు. తద్వారా ట్రాన్స్‌జెండర్స్ సమగ్రాభివృద్ధికి, సాధికారతకు పాటుపడుతుందన్నారు. సమాజంలో ట్రాన్స్‌జెండర్స్ పట్ల నెలకొన్న అపోహలను, చులకన భావాన్ని, వివక్షను తొలగించేందుకు బోర్డు ద్వారా మార్గదర్శకాల రూపకల్పన జరుగుతుందన్నారు.
ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇప్పటికే తమ కార్యాలయంలో ట్రాన్స్‌జెండర్స్ కోసం ప్రత్యేక టాయిలెట్స్ ఏర్పాటు చేసిందని జీఎస్ నవీన్ కుమార్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇతర శాఖలు, కార్యాలయాల్లోనూ ట్రాన్స్‌జెండర్స్‌కు ప్రత్యేక టాయిలెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో చాలామంది ఉన్నత చదువులు చదువుకున్నవారు ఉన్నవారిని… స్కిల్ ట్రైనింగ్ అందించగలిగితే ఉద్యోగ, ఉపాధి విషయంలో వారికి ఒక దారి చూపవచ్చునని అన్నారు. సాధారణ జనంలో, ఉద్యోగ సంస్థల్లో ట్రాన్స్‌జెండర్స్ పట్ల వివక్షను తొలగించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.
వన్ స్టాప్ ట్రాన్స్‌జెండర్ సర్వీస్
హెచ్ఐవి నివారణపై పనిచేస్తున్న వాలంటరీ హెల్త్ సర్వీసెస్ అనే ఎన్జీవో డిప్యూటీ డైరెక్టర్ అరుముగం విజయరామన్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ‘వన్ స్టాప్ ట్రాన్స్‌జెండర్ సర్వీస్’ సెంటర్లను ఏపీలో ఏర్పాటు చేసిందన్నారు. విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రి సహా మొత్తం 6 చోట్ల ఈ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ట్రాన్స్‌జెండర్స్ ఆ ఆసుపత్రులకు వచ్చినట్లయితే.. వారికి తగిన వైద్య చికిత్స అందించడం జరుగుతుందన్నారు.