
ap skill development corporation
ఇంటర్మీడియట్, అంతకంటే తక్కువ చదువు ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ హబ్స్‌ను ఏర్పాటుకు పూనుకుంది. స్థానిక కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ స్కిల్ హబ్స్‌కు శ్రీకారం చుట్టింది. తొలి దశలో భాగంగా 66 స్కిల్ హబ్స్‌ను ప్రభుత్వం ప్రారంభించింది.
రాష్ట్రంలో ఏర్పాటైన కంపెనీలు అర్హులైన స్థానికులకే ఉపాధి కల్పించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. స్థానికులకు అసరమైన నైపుణ్యాలు అవసరం అవుతాయి. ఈ క్రమంలో కంపెనీలకు అవసరమైన మానవ వనరులను అందించాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం స్కిల్ హబ్స్‌ను తీసుకొచ్చింది.
ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున 175తో పాటు అదనంగా మరో రెండు కలిపి మొత్తం 177స్కిల్ హబ్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో తొలి దశ కింద 66 స్కిల్ హబ్స్‌ను ఇప్పటికే ప్రారంభించింది ప్రభుత్వం. కర్నూలు జిల్లా డోన్‌లో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్‌ను రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)ఎండీ సత్యనారాయణ ప్రారంభించారు. తద్వారా 66 స్కిల్ హబ్స్ తొలి దశలో అందుబాటులోకి వచ్చాయి.
రాష్ట్రంలో రెండు స్కిల్ యూనివర్సిటీలు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజీ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గస్థాయిలో స్కిల్ హబ్ ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. త్వరలోనే మిగిలిన 111 హబ్స్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
స్కిల్ యూనివర్సిటీలు, కాలేజీలో కోసం.. స్థానికంగా ఉన్న పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించే విధంగా కోర్సులను తీర్చిదిద్దుతున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఆయా సంస్థలే వారికి ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది.