
ap govt focuses to develop tirupati as cancer care hub says minister vidadala rajini
రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్సకు ప్రధాన కేంద్రంగా తిరుపతిని ప్రభుత్వం అభివృద్ధి చేయనుందని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ పేర్కొన్నారు. క్యాన్సర్‌కు సంబంధించి అధునాతన చికిత్స విధానాలు అందుబాటులో ఉండేలా తిరుపతిని క్యాన్సర్ కేర్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఈ దిశగా బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ (BIO) ఏర్పాటు కీలకమవుతుందన్నారు. త్వరలోనే తిరుపతిలో ఈ ఇన్స్టిట్యూట్ అందుబాటులోకి వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రొచె ఫార్మా సంయుక్తంగా తిరుపతిలో నిర్వహించిన ‘బ్రెస్ట్ క్యాన్సర్ కంటిన్యూమ్ కేర్’ వర్క్ షాప్‌లో మంత్రి విడదల రజినీ పాల్గొని ప్రసంగించారు.
బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ద్వారా సర్జికల్, మెడికల్, రేడియేషన్ ఆంకాలజీ తదితర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి విడదల రజినీ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ చికిత్స కేంద్రాలకు ఈ ఇన్స్టిట్యూట్ అనుసంధానించబడుతుందని.. తద్వారా క్యాన్సర్ రోగులకు సమగ్ర, అధునాతన చికిత్సలను అందించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతున్నందునా.. ప్రతీ రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ వ్యవస్థ అవసరమన్నారు.
రోగి కేంద్రంగా పనిచేయడం.. అత్యాధునిక చికిత్స పద్దతులను అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో తిరుపతిలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి ఎక్కడికో వెళ్లకుండా రాష్ట్రంలోనే మెరుగైన వైద్య చికిత్స పొందేందుకు ఇది దోహదపడుతుందన్నారు. తిరుపతిలోని స్విమ్స్ పాలియేటివ్ కేర్ (ఉపశమన చికిత్సలు అందించే కేంద్రం)లో ‘పాలియం ఇండియా’తో కలిసి వచ్చే నెలలో ఫౌండేషన్ కోర్సును కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
మంత్రి విడదల రజినీ పాల్గొన్న ఈ కార్యక్రమానికి దాదాపు 200 మంది హెల్త్ కేర్ నిపుణులు పాల్గొన్నారు. రొమ్ము క్యాన్సర్ పట్ల మహిళల్లో అవగాహనకు సంబంధించిన అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. రొచె ఫార్మా ఎండీ, సీఈవో వి.సింప్సన్ మాట్లాడుతూ… ఏపీలో క్యాన్సర్ కేర్ వ్యవస్థ బలోపేతానికి తాము రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. అధునాతన చికిత్సలు, వైద్యులకు శిక్షణ కార్యక్రమాల విషయంలో సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం క్యాన్సర్ రోగుల చికిత్స కోసం ఇప్పటివరకూ రూ.400 కోట్లు ఖర్చు చేసిందని సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రతినిధులు పేర్కొన్నారు. వైద్య రంగంపై చేసిన వ్యయంలో ఇది 25 శాతమని తెలిపారు.