
supreme court
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మూడు రాజధానుల అంశం ఇప్పుడు ఒక సంచలనం గా మారింది. హై కోర్టు తీర్పుతో మూడు రాజధానుల విషయం ముగిసిన అధ్యాయంగా అంతా భావించారు. అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వ్యవహారం చూస్తుంటే అది అతి తాత్కాలిక విరామమే అని అర్థమవుతోంది. అమరావతి రైతుల పాదయాత్ర, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మూడు రాజధానుల అంశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికార వికేంద్రికరణపై మరింత దూకుడుగా వెళ్తోంది జగన్ ప్రభుత్వం.
సుప్రీకోర్టుకు ఏపీ సర్కార్..
తాజాగా మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడం.. అధికార వికేంద్రికరణపై ఏపీ ప్రభుత్వం ఎంత సీరీయస్ గా ఉందో అర్థం అవుతుంది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును జగన్ ప్రభుత్వం సవాల్ చేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదన్న హైకోర్టు తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని తన వ్యాజ్యంలో ఏపీ సర్కార్ పేర్కొంది. అందుకే హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని కోరింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలంటూ హైకోర్టు సూచించడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని పేర్కొంది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులని పిటిషన్లో పేర్కొన్న ప్రభుత్వం.. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని చెప్పింది.
శుక్రవారం అసెంబ్లీ లాబీలో మంత్రి గుడివాడ అమర్ నాథ్ కూడా మూడు రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది నుంచి విశాఖ నుంచి పాలన ఉంటుందని చెప్పారు. ఆయన చెప్పిన మరుసటి రోజే ఏపీ సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో అధికార వికేంద్రికరణపై జగన్ సర్కారు చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
ఆత్మరక్షణలోకి టీడీపీ..
అడ్మినిష్ట్రేషన్ క్యాపిటల్ ద్వారా ఉత్తరాంధ్ర.. జ్యుడీషియల్ క్యాపిటల్ వల్ల రాయలసీమ అభివృద్ధి చెందుతుందనేది నిర్వివాదమైన అంశం. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. అధికార వికేంద్రికరణ- అభివృద్ధి నినాదాలతో జగన్ ముందుకు వెళ్తున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం.. టీడీపీ కచ్చితంగా ఇరకాటంలోకి నెడుతుంది. ఉత్తరాంద్ర, రాయలసీమలో టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టివేయడానికి.. మూడు ప్రాంతాల అభివృద్ధి నినాదం జగన్ కు ఉపయోగపడుతుంది. విశాఖ, కర్నూలు ప్రాంతాలు రాజధానులు చేస్తే.. ఆ క్రెడిట్ జగన్ కే దక్కతుంది. ఆయనను రెండు ప్రాంతాల వారు ఎన్నిటికీ మరిచిపోరు.