
teachers promotion
ఆంధ్రప్రదేశ్ లోని ఉపాధ్యాయులకు త్వరలో శుభవార్త అందించనుంది ప్రభుత్వం. 22ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న టీచర్ల కల సాకారం కాబోతోంది. రాష్ట్రంలో దాదాపు 10వేల మందికి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించాలని జగన్ సర్కారు ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రక్రియను సెప్టెంబర్ మొదటి వారంలో చేపట్టాలని విద్యాశాఖను ఆదేశించింది.
స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎంలు, మండల అధికారులు, జిల్లా ఉప విద్యాశాఖాధికారులుగా అర్హులకు పదోన్నతి దక్కనుంది. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడం కోసం ఈ ప్రక్రియ దోహదపడుతుందని సర్కారు భావిస్తోంది. పదోన్నతుల ద్వారా ఖాళీ అయిన స్థానాలను ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనున్నట్లు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని సంస్కరణ కారణంగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల అవసరం గతంలో కంటే ఎక్కవైంది. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ల అవసరం చాలా ఉంది. ప్రమోషన్ల ఉద్దేశం కుడా స్కూల్ అసిస్టెంట్లను తీసుకోవడం కోసమేనని సమాచారం. అర్హులైన ఎస్జీటీలకు పెద్ద ఎత్తున స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వనున్నారు. తాజా ప్రమోషన్లలో దాదాపు 7వేల వరకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందేవారే ఎక్కువగా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని స్కూళ్లలో హెడ్మాస్టర్ల కొరత చాలా ఉంది. ఈ ప్రమోషన్ల ద్వారా దాదాపు ఆ సమస్యను తీర్చాలని విద్యాశాఖ భావిస్తోంది.
చాలా ఏళ్లుగా ఎంఈఓ పోస్టులు భర్తీకి నోచుకోలేదు. దీంతో విద్యకు సంబంధించి చాలా కార్యక్రమాలు అమలుకు కాని పరిస్థితి ఏర్పడింది. అందుకే తాజా ప్రమోషన్ల ద్వారా.. ఎంఈఓ పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే పదోన్నతుల విషయం కాస్త వివాదాస్పదంగా మారింది. ఇవి స్థానిక సంస్థల స్కూల్ టీచర్లకు కేటాయించవద్దని ప్రభుత్వ టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో 53 డిప్యూటీ డీఈవో పోస్టుండగా.. వీటిపైనా నివాదం నడుస్తోంది. ఫలితంగా గత ప్రభుత్వం ఆ ఖాళీలను భర్తీ చేయకుండా వదిలేసింది. అయితే ప్రస్తుత సీఎం జగన్ ప్రత్యేక చొరవతో అన్నీ పోస్టులను వివాద రహితంగా భర్తీ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ సారి డిప్యూటీ డీఈఓ పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ అయ్యే అవకాశం ఉంది.
మున్సిపల్ టీచర్లకు సంబంధించిన బాధ్యతలను కూడా ప్రభుత్వం విద్యాశాఖకే అప్పగించింది. వీరికి సంబంధించిన సర్వీసు అంశాలు, పదోన్నతులు, వేతనాలు, బదిలీలను కూడా పాఠశాల విద్యాశాఖ చేపట్టనుంది. వీరికి కూడా ఎస్ఏలు, హెచ్ఎంలు, ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలుగా పదోన్నతులు లభించనున్నాయి. ఎలాంటి న్యాయపరమైన సమస్యలకు తావు లేకుండా పదోన్నతులను చేపట్టేలా పాఠశాల విద్యాశాఖ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ పదోన్నతుల ప్రక్రియను సెప్టెంబర్ మొదటి వారం నుంచి చేపట్టనుంది. వాటిని ముగించిన అనంతరం టీచర్ల సాధారణ బదిలీలను చేపడుతుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను కూడా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది.
వేల మంది స్కూల్ అసిస్టెంట్ టీచర్లు తమ సబ్జెక్టుల మార్పుకోసం దాదాపు 22 ఏళ్లుగా ప్రభుత్వానికి విన్నపాలు చేస్తూ వచ్చారు. ఇన్నాళ్లకు వారి కల సాకారం కాబోతోంది. ఈమేరకు స్కూల్ అసిస్టెంట్లకు తమ అర్హతలను అనుసరించి సబ్జెక్టుల మార్పునకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. దీనివల్ల 2,300 మంది టీచర్లకు లబ్ధి చేకూరనుంది.