
cold storages
రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ధర లేని పరిస్థితులలో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి వీలుగా శీతల గిడ్డంగుల ఏర్పాటు చేసే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. అయితే ఆ గిడ్డంగులను గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయడానికి పూనుకోవడం ఇక్కడ విశేషం అని చెప్పాలి. తమ పంటలకు రేటు వచ్చినప్పుడు అమ్ముకొని.. తద్వారా అదనపు ఆదాయం పొందడానికి గ్రామస్థాయిలో ఏర్పాటు చేయబోయే శీతల గిడ్డంగులు ఉపయోగపడుతాయని రైతులు చెబుతున్నారు.
తొలి దశలో భాగంగా నాలుగు రైతు భరోసా కేంద్రాలకు ఒక కోల్డ్ స్టోరేజి చొప్పున నిర్మించేలా ప్రభుత్వం ప్లాన్ రెడీ చేస్తోంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో గిడ్డంగుల నిర్మాణం చేపట్టనుంది. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయబోయే ఈ స్టోరేజీలతో ఉద్యాన రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.
” ఉద్యాన పంటలు సాగుచేస్తున్న జిల్లాల్లో శీతల గిడ్డంగులను చేపట్టేందుకు ఉద్యాన శాఖ బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది. రాయలసీమలో 945 కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశాం. ఉద్యాన పంటలు పండించే రైతులకు ఆదుకుంటాం” అని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
అయితే కోల్డ్ స్టోరేజీల పనులపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదిక ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. వచ్చే పండ్ల సీజన్ నాటికి కోల్డ్ స్టోరేజీలను అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా 40 శాతం సబ్సిడీ..
వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధుల (అగ్రి ఇన్ఫ్రా ఫండ్) కింద కేంద్ర ప్రభుత్వం శీతల గిడ్డంగుల నిర్మాణానికి 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా 40 శాతం సబ్సిడీని ఇస్తోంది. శీతల గిడ్డంగుల నిర్మాణాన్ని చేపట్టడానికి రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం 40శాతం సబ్సిడీని అందజేస్తోంది. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పీఓలు) కోల్డ్ స్టోరేజీ యూనిట్లను తీసుకోవడానికి 75 శాతం సబ్సిడీని పొందుతాయి. ఈ యూనిట్లు సేకరణ-కమ్-స్టోరేజీ కేంద్రాలుగా పనిచేస్తాయి.
నవరత్నాల్లో భాగంగా రైతు భరోసాను ప్రకటించారు సీఎం జగన్. ఈ పథకంలో భాగంగా కోల్డ్‌స్టోరేజీ ప్లాంట్లు, గిడ్డంగులు, నియోజకవర్గాల స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటివన్నీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించి కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు నిర్మించుకునే వెసులు బాటు కల్పిస్తానని వాగ్దానం చేశారు. రైతులు తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించుకునేలా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తానన్నారు. ఆ హామీని నెరవేర్చుకునేందుకు ఇప్పుడు.. గ్రామస్థాయిలో శీతల గిడ్డంగులకు శ్రీకారం చుట్టారు. శీతల గిడ్డంగులు వస్తే ధర లేనప్పుడు ఉద్యాన ఉత్పత్తుల్ని రైతులు నిల్వ చేసుకుని సరైన ధరకు అమ్ముకునే వెసులు బాటు ఉంటుంది.